టీవీ9 తెలుగు నాట నెంబర్ వన్ న్యూస్ చానల్.. ఆ ఛానల్ పుట్టిన దగ్గర నుంచి తన స్థానం మాత్రం పదిలం. ఆ తర్వాత ఎన్ని ఛానళ్లు వచ్చినా టీవీ9 ను బీట్ చేయలేకపోయాయి. ఇటీవల ఆ ఛానల్ యాజమాన్యం చేతులు మారినా.. రేటింగుల్లో ప్లేస్ మాత్రం తగ్గలేదు. అదే టెంపో మెయింటైన్ చేస్తున్నది. అలా అనడం కంటే.. జనం అలా అలవాటు పడిపోయారు అనుకోవడం బెటరేమో.
ఇక ఇప్పుడు ఆ టీవీ9 ను పోటీగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ దూసుకొస్తోంది. అదే వీ6. గతంలో టీవీ9 తర్వాత స్థానంలో టీవీ5, ఎన్టీవీ ఉండేవి.. ఈ రెండు కాస్త ప్లేసులు కూడా మారుతుండేవి. కానీ కొన్నాళ్లుగా సెకండ్ ప్లేస్ ను వీ6 న్యూస్ ఛానల్ కైవసం చేసుకుంటోంది. ప్రత్యేకించి కరోనా ఎఫెక్ట్ తో వీ6 ఛానల్ దుమ్మురేపుతోంది. తెలంగాణలో ప్రముఖ నేత దివంగత వెంకటస్వామి కుమారుడు వివేక్ ఈ ఛానల్ యజమాని.
ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో తెలంగాణతనాన్ని అడుగడుగునా నింపుకున్న ఛానల్ ఇది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు చిరునామాగా మారింది. తెలంగాణలో అధికార పార్టీ న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఉన్నా కూడా జనం వీ6కే ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. తీన్మార్ వార్తలతో ఈ ఛానల్ ఇమేజ్ ఒక్కసారిగా మరుమోగింది. ఆ తర్వాత మాటకారి మంగ్లి, బిత్తిరి సత్తి, రాములమ్మ, సావిత్రక్క వంటి క్యారెక్టర్లు జనంలోకి బాగా చొచ్చుకువెళ్లాయి.
అందుకే బిత్తిరి సత్తి, సావిత్రి వంటి వారు ఛానల్ వదిలి వెళ్లిపోయినా.. ఆ ఛానల్ జోరు మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు కరోనా వార్తల కవరేజ్‌లో మరింతగా దుమ్మురేపుతోంది. తాజా వారం రేటింగుల్లో ఎప్పటి లాగానే టీవీ9 మొదటిస్థానంలో ఉంటే.. వీ6 రెండో స్థానంలో కంటిన్యూ అవుతోంది. బార్క్ హైదరాబాద్ రేటింగుల్లో టీవీ9కు 333 పాయింట్లు వస్తే.. వీ6 304 పాయింట్లు సాధించింది. వీ6 తెలంగాణపైనే ఫోకస్ పెట్టినా... ఆంధ్రలోనూ ఆ ఛానల్‌కు ఆదరణ ఉంది. ఓవరాల్ తెలుగు రాష్ట్రల రేటింగుల్లోనూ టీవీ9, వీ6 మొదటి రెండు స్థానాలు ఆక్రమించాయి.