తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై కొరడా ఝలిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు ఈ మెయిల్ ద్వారా ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఈ మేరకు సమాచారం అందించింది. మూసివేసిన కాలేజీలలో ఎక్కువగా శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలే ఉండటం గమనార్హం. 
 
ఈ కాలేజీలలో 26 నారాయణ కాలేజీలు, 18 శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ఈ మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు చెబుతోంది. గతంలో సామాజిక కార్యకర్త రాజేశ్ రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. 
 
గతంలో రాష్ట్ర హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టి గుర్తింపు లేని కళాశాలల వివరాలను ఇవ్వాలని బోర్డుకు సూచించింది. అయితే మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కాలేజీలను మూసివేస్తే విద్యార్థుపై ఆ ప్రభావం పడుతుందని బోర్డు హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు ఏప్రిల్ 3న తుది నివేదిక అందించాలని ఆదేశించగా బోర్డు అందుకు అంగీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. 
 
మరోవైపు హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంపై హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు కరోనా వైరస్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. కరోనా ప్రభావం, టెస్టింగ్ కిట్లు, ఇతర వివరాలను తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న 67 వేల కిట్లతో హాట్ స్పాట్లలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలకు ఎలా పరీక్షలు నిర్వహిస్తారని ప్రశ్నించింది. దీనిపై ఏప్రిల్ 24లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: