దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటం... కరోనా వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. తినడానికి తిండి లేక కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఎవరో ఒకరు తమకు సహాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. 
 
ఇలా పేద ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గొప్ప మనస్సును చాటుకున్నారు. పేదలకు తానే స్వయంగా వంట చేసి పేదలకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్పశ్రీవాణితో పాటు ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు కుడా వంట చేయడంతో డిప్యూటీ సీఎంకు సహాయసహకారాలు అందించారు. పుష్పశ్రీవాణి వైసీపీ నేతలకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ఒక సవాల్ విసిరారు. 
 
దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ స్థోమతకు తగిన విధంగా పేదలకు సహాయం చేయాలని కోరారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తాము ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నామని పేద ప్రజలకు తమ వంతుగా సహాయం చేస్తామని చెబుతున్నారు. 
 
పుష్పశ్రీవాణి లాక్ డౌన్ వేళ అన్నం, సాంబార్, పెరుగన్నం, పచ్చడి, మంచినీళ్ల బాటిల్ ను ప్యాకింగ్ చేసి పేదలకు అందజేశారు. వంట ఆరంభం నుంచి ప్యాకింగ్ వరకు ఎవరి సహాయం తీసుకోకుండా పుష్పశ్రీవాణి దంపతులే ప్యాకింగ్ చేయడం గమనార్హం. డిప్యూటి సీఎం పేదలకు, బస్ షెల్టర్లలో జీవనం సాగిస్తున్న వారికి ఈ ప్యాకెట్లను అందజేశారు. నలుగురికీ సాయం చేయాలని డిప్యూటీ సీఎం దంపతులు ఇచ్చిన పిలుపుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.    

 

మరింత సమాచారం తెలుసుకోండి: