వైయస్ విజయమ్మ... వైయస్సార్ మరణించే వరకు సాధారణ గృహిణిగానే ప్రజలకు సుపరిచితమైన పేరు. జగన్ తండ్రి ఆకస్మిక మరణం అనంతరం ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్ధం కాగా కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2012 సంవత్సరంలో పలువురు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి పదవులు పోగొట్టుకున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్ అరెస్ట్ అయ్యేలా చేసింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు ఉండగా వైసీపీని గెలిపించడానికి ఏ మాత్రం రాజకీయానుభవం లేని సాధారణ గృహిణి విజయమ్మ ప్రజల్లోకి వెళ్లారు. 2012 ఉపఎన్నికల్లో వైసీపీ 18 శాసనసభ స్థానాల్లో పోటీ చేయగా 15 శాసనసభ స్థానాల్లో విజయం సాధించింది.
ఈ గెలుపు కోసం విజయమ్మ పడిన కష్టం అంతాఇంతా కాదు. విజయమ్మ, ఆమె కూతురు షర్మిల ఉపఎన్నికల కోసం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉపఎన్నికల్లో ఘనవిజయంతో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలకు ప్రజల్లో ప్రచారం కల్పించి ప్రజల అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
వైసీపీ ఘనవిజయంతో అప్పటి సీఎం కిరణ్ కు ఊహించని షాక్ ఇచ్చారు విజయమ్మ. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ఊహించని స్థాయిలో 2012 ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానం, వైయస్సార్ పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పాత్ర కూడా 2012 ఉపఎన్నికల విజయంలో కొంతవరకు ఉన్నా విజయమ్మ రాజకీయాల్లో తలపండిన నాయకులకు ఎన్నికల ఫలితాలతో గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి.