ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఈరోజు 75 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 75 కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 722కు చేరగా 92 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు 20 మంది రాష్ట్రంలో మృతి చెందారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ వైరస్ కిట్లపై వివాదం కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న టీడీపీ రాజకీయ నాయకులు కరోనా టెస్ట్ కిట్లపై మాటల యుద్ధానికి దిగారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులు ఛత్తీస్ గఢ్ 337 రూపాయలకు కిట్ కొంటే ఏపీ ప్రభుత్వం 730 రూపాయలకు కిట్ కొనుగోలు చేసిందని విమర్శలకు దిగారు.
వైసీపీ జాతీయ వైద్య మండలి ఏప్రిల్ 8న ఒక్కో కిట్ ను 780 రూపాయలకు కొనుగోలు చేసేలా ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చిందని... ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 7న దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి ఒక్కో కిట్ 730 రూపాయలకు కొనేలా ఆర్డర్ చేసిందని చెప్పింది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విమానాల ద్వారా ఈ కిట్లను తెప్పించామని అందువల్ల ఖర్చు కొంత ఎక్కువ అయిందని తెలిపింది.
దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ హర్యానాలో బ్రాంచ్ ఉందని... ఏప్రిల్ 7వ తేదీకి అనుమతులు లేని ఆ బ్రాంచ్ కు ఇటీవల కేంద్రం అనుమతులు ఇవ్వడంతో 337 రూపాయలకు ఛత్తీస్ గడ్ కు ఇవ్వడానికి అంగీకరించిందని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం కిట్ల కొనుగోలుకు ముందుగానే ఏదైనా రాష్ట్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే తాము ఆ ధరనే చెల్లిస్తామని నిబంధనలలో పేర్కొన్నామని... ప్రస్తుతం తాము కూడా అంతే మొత్తం చెల్లిస్తామని పేర్కొంది. చంద్రబాబు ప్రశ్నించడం వల్లే ఏపీ ప్రభుత్వానికి డబ్బులు మిగిలాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.