ఏపీలో కులాల రాజకీయం బాగా ముదురుతోంది. గతంలో సామాజిక వర్గం అంటూ విమర్శించేకునేవాళ్లు ఇప్పుడు ఏకంగా కులాల పేర్లు పెట్టుకుని మరీ తిట్టుకుంటున్నారు. ఇటీవల మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కులాలపై చేసిన కామెంట్లు మరోసారి ఏపీ రాజకీయాల్లో కాకరేపాయి. కమ్మ వాళ్లను తక్కువ అంచనా వేయొద్దని.. వారు తలచుకుంటే జగన్ ఉండడంటూ రాయపాటి కామెంట్ చేయడం వివాదాస్పదం అయ్యింది.
ఇప్పుడు వైసీపీ నాయకులు రాయపాటికి కౌంటర్ ఇస్తున్నారు. మాజీ ఎమ్.పి రాయపాటి సాంబశివరావుపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మండిపడ్డారు. రాయపాటికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయపాటి ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్కపనీ చేయలేదని... సొంత సామాజికవర్గం ఎమ్మెల్యేలే ఆయన్ను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయలేదని విమర్శించారు.
మరి సొంత కులమైన మీ కమ్మ వాళ్లే నిన్ను అప్పుడు దగ్గరకు రానివ్వలేదు.. ఆ సంగతి మరచిపోయారా.. అంటూ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు విమర్శించారు. మరి అప్పుడు కులం గురించి ఎందుకు మాట్లాడలేదు ?.. అంటూ రాయపాటిని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నిలదీశారు.
వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే రాయపాటికి గౌరవం ఉంటుందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అంటున్నారు. రాయపాటి దగ్గరి బంధువే మా నియోజకవర్గంలో ఉద్యోగం చేస్తున్నాడని.. మరి కమ్మవారికి ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఎలా మాట్లాడతారని శంకరరావు కామెంట్ చేశారు. ఓవైపు రాయపాటి సాంబశివరావుకు వయస్సు మీదపడుతోంది. ఇక ఆయనకు ఏ పార్టీ కూడా ఎన్నికల్లో నిలబెట్టి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించంలేదు. అలాంటి వ్యక్తి హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఇలా కులం కుంపట్లు రాజేయడమేంటన్న విమర్శలు వస్తున్నాయి.