లాక్‌డౌన్‌..! లాక్‌డౌన్‌..! ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించి రేపటికి నెల రోజులవుతోంది. దేశానికి నెల రోజులుగా తాళం పడింది. లాక్‌డౌన్‌తో ఆర్ధికవ్యవస్థ నేలచూపులు చూస్తోంది. మరి నెల రోజుల లాక్‌డౌన్‌లో భారత్‌ ఎలా ఉంది..? కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేశామా..? 

 

జస్ట్ ... నెల రోజుల వ్యవధిలో జీవితం ఊహించని విధంగా మారిపోయింది. రెండు నెలల క్రితం వుహాన్‌ను లాక్‌డౌన్ చేశారనే అనగానే.. ఇది ఎలా సాధ్యం అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కోటి మంది నివశించే నగరాన్ని అలా అష్ట దిగ్బంధం చేయవచ్చా అని ముక్కున వేలేసుకున్నారు. ఎంతో సమయం పట్టలేదు. నెల క్రితం వరకూ లాక్ డౌన్ అన్న మాటకు సరిగా అర్థం తెలీని పరిస్థితి నుంచి ఇప్పుడు అదెలా ఉంటుందో దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. ఒక నగరం కాదు. మొత్తం దేశమే లాక్‌డౌన్‌లో ఉందిప్పుడు.  కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్‌ని మించిన ఔషధం, ఆయుధం లేదన్నది వాస్తవం. 

 

ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించిన మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందున్న అత్యుత్తమ ఆప్షన్‌ లాక్‌డౌన్‌ ఒక్కటే అత్యుత్తమమని నిరూపితమైంది.  మార్చ్ 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించాక ఏప్రిల్ 14కు పరిస్థితులు చక్కబడతాయని దేశమంతా భావించింది. అప్పట్లో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంతా అదుపులో ఉందని భావిస్తున్న టైమ్‌లో మర్కజ్ ఘటన బాంబులా పేలింది. ఒక్కసారిగా అదుపు తప్పింది. మర్కజ్ కి వెళ్లొచ్చిన వారు దేశమంతటా తిరగడం, అనేక మందిని కలవడంతో.. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగింది.  లాక్‌డౌన్ అమల్లో ఉంటేనే కేసులు ఇలా పెరుగుతుంటే.. దిగ్బంధాన్ని సడలిస్తే పరిస్థితి కచ్చితంగా అదుపు తప్పింది.

 

కరోనా లాంటి  ప్రమాదకరమైన మహమ్మారి అంత త్వరగా వీడిపోవటం సాధ్యమయ్యేది కాదు. కోటి మందికి పైగా జనాభా ఉన్న వుహాన్‌లో 76రోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు. అలాంటిది 135కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితుల్ని అదుపు చేయడం సాధ్యమేనా. మన దేశంలో మౌలిక సదుపాయాల్ని పరిగణనలోకి తీసుకుంటే.. లాక్ డౌన్  తప్ప మరో మార్గం లేదు. వైరస్‌ను అదుపు చేయాలంటే లాక్‌డౌన్ తప్పనిసరి.

 

మన దేశంలో తొలి కేసు జనవరి చివరి వారంలోనే నమోదైనా మార్చి నుంచి కేసుల సంఖ్య పెరిగింది. లాక్ డౌన్ మొదలయ్యాక ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. లాక్ డౌన్‌ వల్ల పంటల్ని నష్టపోవాల్సి రావడం, వివిధ రంగాల్లో ఉపాధి సమస్య, వలస కూలీలు, నిత్యావసరాల ఉత్పత్తి వంటివి సమస్యగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కొన్ని రంగాలకు ఏప్రిల్20 నుంచి మినహాయింపు ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం 19 వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 600కి చేరింది. ఒక వేళ లాక్‌డౌన్ లేకుంటే.. ఈపాటికి కరోనా కేసులు 8 లక్షలు దాటేవని గతంలో ప్రభుత్వమే ప్రకటించింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక రంగం కుదేలయిండొచ్చు. కానీ కరోనా వేగంగా వ్యాపించకుండా కట్టడి చేశాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: