ఇండియాను కరోనా ఊపేస్తోంది. కానీ.. గోవాలో మాత్రం కరోనా పప్పులు అస్సలు ఉడకడం లేదు. ప్రస్తుతం ఒక్క కేసు కూడా గోవాలో లేదు.. ఏంటీ నమ్మడం లేదా...ఇది నిజ్జంగా నిజం.. గోవాలో కరోనా లేనేలేదు.. ఇప్పుడు దేశంలో కరోనా లేని రెండు రాష్ట్రాల్లో గోవా నెంబర్ వన్.. ఇదే ఇప్పుడు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే.. గోవా లాంటి ప్లేసుల్లో ఇలాంటి వైరస్‌లు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి. అలాంటిది నో కరోనా జోన్‌గా గోవా.. గ్రేటెస్ట్ గోవా అనిపించుకుంటోంది.
కాకులు దూరని కారడవిలో కూడా కరోనా కాలు మోపుతోంది.. ఊహించని కేసులతో ఊపేస్తోంది. దేశంలోని నలుమూలలా ఈ వైరస్ ఉనికి చాటుతోంది. కానీ గోవాలో మాత్రం మనుగడ సాగించలేకపోతోంది. ఎంట్రీ ఇచ్చినా.. అక్కడి అధికారుల దెబ్బకు గోవా నుంచి పారిపోయింది.. ఇప్పుడు గోవాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. కరోనాకు గోవాలో గడ్డుకాలమే..
ఇండియా లాస్‌వెగాస్ ఇప్పుడు చాలా హ్యాపీగా..కూల్‌గా ఉంది.. ఎంటర్‌టైన్‌మెంట్ అన్‌లిమిటెడ్ అడ్డా.. ప్రశాంతంగా ఉంది. 24 బై 7 కలర్‌ఫుల్ ఎంజాయ్‌మెంట్‌తో సందడి చేసే గోవాలో కరోనా అస్సలు లేదు.
గోవా అంటే..అందమైన.. ఆహ్లాదకరమైన నగరం.. ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతం.. గోవా పేరులోనే ఓ మ్యాజిక్ ఉంది.. అందుకే మన దేశంలో యూత్‌కు గోవాపై ఉన్న క్రేజే వేరు. లైఫ్‌లో ఒక్కసారైనా గోవాలో ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి ప్లేస్ అది.. ఇక న్యూ ఇయర్ ఫంక్షన్లు గోవాలో జరిగినట్లు మరెక్కడా జరగవేమో.. అందుకే ఫారినర్స్ కూడా గోవా టూరిస్ట్ స్పాట్స్‌లో భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఫారినర్స్‌కైనా..ఇండియన్స్‌కైనా.. మనదేశంలో టూరిస్ట్ హాట్‌స్పాట్ ఏదైనా ఉందంటే అది గోవానే.. అన్ని రకాల ఎంజాయ్‌మెంట్‌కు గోవా స్వర్గధామం..గోవాను పర్యాటకులకు పట్టు పరుపు లాంటిది.. గోల్డెన్ బీచ్‌లకు నిలయమైన గోవాలో హద్దుల్లేని ఆనందం దక్కుతుంది.. ఇలాంటి ప్లేస్‌లో కరోనా లేదంటే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యమే..
దేశంలోనే కరోనా వైరస్ రహిత తొలి రాష్ట్రంగా గోవా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఏడుగురికి ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారినపడగా.. అందరూ కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. బాధితుల్లో ఆరుగురికి ట్రావెల్స్ హిస్టరీ ఉండగా.. ఇంకొకరు వీరిలో ఒకరి సోదరుడు. ఏప్రిల్ 3 నుంచి ఆ రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు నమోదు కాలేదు. చివరి బాధితుడు గత ఆదివారం కోలుకోవడంతో కరోనా ఫ్రీ స్టేట్‌గా గోవా నిలిచింది. ఇది గోవాకు ఊరట కలిగించే అంశమైనా.. మరో రూపంలో ప్రమాదం పొంచి ఉంది. పొరుగున ఉన్న కర్ణాటకలోని బెల్గాం ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులును మూసివేసి, రాష్ట్రంలోకి వచ్చినవారిని క్వారంటైన్‌కు తరలిస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెబుతున్నారు.
బెల్గాం నుంచే గోవాకు కూరగాయలు, పండ్లు పెద్ద సంఖ్యలో వస్తాయి. అందుకే గోవాకు వాణిజ్య పరంగా.. నిత్యావసరాల పరంగా బెల్గాం కీలకం కావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు, దాదాపు 7,000 మంది నౌకాదళ సిబ్బంది ఇప్పుడు రాష్ట్రానికి తిరిగి రావడానికి సిద్ధమవుతుండటంతో వీరిలో ఎవరైనా వైరస్ బారినపడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. సముద్రయానం చేసి రాష్ట్రంలోకి వచ్చినవారు తప్పనిసరిగా 28 రోజులు నిర్బంధంలో ఉండాలి. వైరస్ వ్యాధులు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలని గోవా వైద్య నిపుణులు చెబుతున్నారు.
దేశంలో అత్యధిక విదేశీ పర్యాటకులు రాకపోకలు చేసే రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. అయితే, చైనాలో కరోనా వైరస్ ప్రబలుతున్న సమాచారం తెలియగానే గోవా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దేశంలోనే తొలిసారిగా విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించేందుకు స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఫలితంగా కరోనా వైరస్ రోగులు తమ రాష్ట్రంలోకి చొరబడకుండా జాగ్రత్తపడింది.
జనతా కర్ఫ్యూలో భాగంగా మార్చి 22 నుంచే గోవా అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేసింది. ముఖ్యంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వాహనాలేవీ గోవాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది. క్రీడా కార్యక్రమాలు, పోటీలు, మత సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు సైతం సహకరించారు. ఫలితంగా ఏప్రిల్ 3 వరకు గోవాలో ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. దీంతో.. కేంద్ర ప్రభుత్వం గోవాను కరోనా ఫ్రీ స్టేట్‌గా ప్రకటించింది.
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. గోవాలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గోవాలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ గోవాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య జీరోకు చేరింది. అయితే గోవాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ఓ వైద్యుడు కీలక పాత్ర పోషించారు. ఆయనే డాక్టర్ ఎడ్విన్ గోమ్స్. గోవాలోని కోవిడ్ ఆస్పత్రికి నోడల్ ఇంచార్జ్‌గా ఉన్న ఎడ్విన్ నేతృత్వంలోని వైద్య బృందం నిరాంతరాయంగా శ్రమించి కరోనా బాధితులకు చికిత్స అందించారు. ఒకరు కూడా ప్రాణాలు కోల్పోకుండా చూశారు. మొదట్లో కరోనా కేసులు ప్రారంభమైన సమయంలో గోవాలో కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం కొద్దిపాటి కలవరానికి గురిచేసింది. కానీ గోవా ప్రభుత్వం, వైద్య సిబ్బంది దానిని అధిగమించి కరోనా కట్టడిలో విజయం దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఓ రేంజ్‌లో వణికిస్తోంది. కంటికి కనిపించని ఓ వైరస్‌తో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఇక మనదేశంలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.