అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతులకు వరుసగా నష్టాలే మిగులుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మార్కెటింగ్ సౌకర్యం లేకుండా పోయింది. నెల రోజుల క్రితం మహా నగరాలకు పండ్లను ఎగుమతి చేసిన రైతులు తాజా పరిస్థితులతో గగ్గోలు పెడుతున్నారు. పంటంతా తోటల్లోనే వదిలేసే పరిస్థితులు వచ్చాయి. స్థానిక మార్కెట్లలో అమ్ముకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
హార్టీకల్చర్ హబ్‌గా పేరున్న అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా రైతులపై కరోనా ఎఫెక్ట్ పడింది. వేసవిలో ఉద్యాన రైతులకు మంచి ఆదాయం లభించేది. కర్భూజ, పుచ్చకాయ, అరటి, చీనీ పంటలతో రాబడి బాగుండేది. లాక్‌డౌన్ కారణంగా ఒక్కసారి రైతుల బతుకు తిరగబడింది. లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలకు గిరాకీ లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు బంద్ అయ్యాయి. ఎగుమతులు లేకపోవడంతో పంట మొత్తం నేలపాలు చేశారు రైతులు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక మార్కెట్లలో అమ్మకాలు జరిగినా..కనీసం రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం ఇదే జాబితాలోకి దానిమ్మ పంట చేరింది. సాధారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తోటల వద్దకే వచ్చి పంటంతా కొనుగోలు చేస్తుండేవారు. దేశంలో ఎక్కడా మార్కెట్లు లేకపోవడంతో వ్యాపారులు ఎవరూ పొలాల వైపు రావడమే లేదు.
అనంతపురం జిల్లాలో దానిమ్మ తోటలు సుమారు 8 వేల హెక్టార్లలో సాగుచేశారు రైతులు. జిల్లాలో పండే పండ్లను ఏ వన్ ఫ్రూట్‌గా దేశంలోని మహా నగరాల్లో పిలుస్తుంటారు. అందుకే ఇక్కడి ఉద్యాన పంటలకు అంత గిరాకీ ఉంటుంది. ధర కూడా అదే స్థాయిలో పలుకుతుంది. గత ఏడాది దానిమ్మ బయటి మార్కెట్లో కిలో 90 నుంచి 110 రూపాయలు పలికింది. ఐతే ఇప్పుడు రైతుకు కేవలం 20 నుంచి 30 రూపాయలే ఇస్తామంటున్నారు వ్యాపారులు.
ఇక...ఈ ధరలు వింటున్న రైతులకు గుండెలు పగిలినంత బాధ కలుగుతోంది. ఉద్యానవన శాఖాధికారులు చూపిస్తున్న లెక్కలు చూసి ప్రభుత్వం తామే రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని చెప్పుకుంటోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించటం లేదు. లోకల్ మార్కెట్లలో అయినా అమ్ముకుందామన్నా ఉపయోగం లేకుండా పోయింది. బయటి ప్రాంతాలకు విక్రయించే ధరల్లో పావు వంతు కూడా స్థానిక మార్కెట్లలో రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ స్థాయిలో విక్రయాలు కూడా జరగవని అంటున్నారు.
మొత్తం మీదా...జిల్లాలో ఉద్యాన, కూరగాయల పంటల అన్నింటి పరిస్థితి ఇలానే ఉంది. లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని దానిమ్మ రైతులు కోరుతున్నారు.