దేశంలో, ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా ఏపీలో వైరస్ పంజా విసురుతూనే ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ నిన్న మరోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్ మాట్లాడుతూ కరోనా పూర్తిగా తగ్గే పరిస్థితి ఎప్పటికీ ఉండదని చెప్పారు.
రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపించరాదని పిలుపునిచ్చారు. కరోనా భయంకరమైన రోగమనే భావనను అందరూ మనస్సులోంచి తీసేయాలని అన్నారు. రాబోయే కాలంలో కరోనా అందరికీ సోకవచ్చని తెలిపారు. కొన్ని లెక్కల ప్రకారం అలాంటివాళ్లే 80 శాతం ఉన్నారని అన్నారు.
కరోనా వైరస్ జ్వరంలాంటిదేనని ఎవరికైనా సోకవచ్చని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను త్వరగా నయం చేసుకోవచ్చని తెలిపారు. రేపు పొద్దున కరోనా తనకు కూడా సోకవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకోవాలని అదే కరోనాకు పరిష్కారమని తెలిపారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే 104, 108లకు వెంటనే సమాచారం అందించాలని సీఎం సూచించారు.
ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీలో నిన్న ఒక్కరోజే 80 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1177కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉనాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండటం వల్లే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నిన్నటివరకు 74,555 మందికి కరోనా పరీక్షలు జరిపారు.