కరోనా మహమ్మారితో బెజవాడ వణికిపోతోంది. రాకాసి వైరస్ పంజా విసురుతుండడంతో.. సిటీలో రెండువందలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంతకూ బెజవాడలో కేసుల ఉధృతి పెరగడానికి కారణమేంటి..?..అధికారులు ఏమంటున్నారు..?

 

బెజవాడ కరోనా బాంబ్‌గా మారుతోందా? నగరంలో ఏకంగా రెండొందలకు పైగా కేసులు నమోదవుతుండడం.. అధికార వర్గాలను టెన్షన్ పెడుతోంది.లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా.. వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు.మొత్తం సిటీ అంతా కంటైన్‌మెంట్‌లోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

 

బెజవాడలో కరోనా వ్యాప్తి పెరగడానికి కారణం..  అత్యధిక జనసాంద్రత కూడా ఓ కారణమని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. అమెరికాకు చెందిన డెమో గ్రాఫియా సంస్థ నివేదిక ప్రకారం జన సాంద్రతలో బెజవాడ... ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని తేలింది.  బెజవాడ నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. జనాభా 15 లక్షల పైన ఉంటుంది. ఓ వైపు కొండలు, మరోవైపు కృష్ణా నది ఉండటంతో నగరం విస్తరణ అంతంత మాత్రంగా జరిగింది. బెజవాడలో చదరపు కిలోమీటర్ కు 31 వేల 200 మంది నివసిస్తున్నట్లు ఓ అంచనాగా చెబుతున్నారు. 

 

కరోనా ధాటికి అమెరికా, యూరోప్ దేశాలు అల్లాడుతున్నా.. బెజవాడ వాసుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం వల్లే కేసుల సంఖ్య.. రోజుల వ్యవధిలో వంద నుంచి రెండొందలకు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కృష్ణలంక, కార్మిక నగర్ ప్రాంతాల్లో ఇద్దరు డ్రైవర్ల వల్ల 80 వరకు కేసులు నమోదు కావటం పరిశీలిస్తేనే... నగర వాసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణలంక లో 56, కార్మిక నగర్ లో 40 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర జనాభా ఉన్నారు. దీంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.

 

కరోనా లక్షణాలున్నప్పటికీ ట్రక్ డ్రైవర్.. ఇంటికే పరిమితం కాలేదు. స్నేహితులతో పేకాట ఆడాడు. తెలిసిన వారి ఇంటికెళ్లి సమయం గడిపాడు.ఈయన భార్య సైతం పక్కింటి వారితో హౌసీ లాంటి గేమ్స్ ఆడింది. ఫలితంగా వీరు నివసించే గుర్రాల రాఘవయ్య వీధిలో అందరూ కరోనా బారిన పడ్డారు. కార్మిక నగర్‌కు చెందిన వ్యక్తి విదేశాల నుంచి వచ్చి .. అందరితో ఆడడం, మాట్లాడడం చేశాడు. ఇప్పుడు అక్కడ 40కి పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి క్రికెట్ ఆడడంతో.. అతని స్నేహితునికి వైరస్ సోకింది. అజిత్ సింగ్ నగర్‌లో చాయ్ వాలాకు కరోనా రావడంతో.. అతని దగ్గర టీ తాగిన వారి లిస్ట్ ప్రిపేర్ చేశారు అధికారులు. రాణిగారి తోటకు చెందిన పానిపూరి బండి వ్యాపారి, టిఫిన్ వ్యాపారికి కరోనా సోకింది.ఇక వీరి వద్ద పానీపూరీ, టిఫిన్ చేసినవారు ఎంతమంది ఉంటారు. వారి పరిస్థితి ఏమిటన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

 

క్వారం టైన్  కేంద్రాల్లో మౌలిక వసతులు సరిగ్గా ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. గన్నవరం దగ్గర క్వారం టైన్ కేంద్రంలో పిల్లలకు పాలు.ఇవ్వటం లేదని వారు ఫిర్యాదులు చేసిన పరిస్థితి. దీంతో కొందరు క్వారం టైన్ల కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు.మరి కొన్ని కేసుల్లో  మొదట నెగెటివ్ అని.ఇళ్లకు పంపి తర్వాత పాజిటివ్ అని తీసుకెళ్లటం కూడా ఆందోళన రేపుతోంది. వీటన్నింటినీ క్రోడీకరిస్తున్న అధికారులు... కరోనా నియంత్రణకు చర్యలు చేపదుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: