కరోనా వైరస్ ప్రభావం మానవ జీవితంపై తీవ్రంగా పడింది. సగటు మనిషి ఇంటికే అతుక్కుపోవడంతో టైమ్ పాస్ కోసం ఎక్కువగా ఇంటర్నెట్ నే వినియోగించాడు. సాధారణ రోజుల్లో కూడా ఇంటర్నెట్ ను ఓ మోస్తారుగా ఉపయోగించే మానవుడు రోజంతా ఖాళీ సమయం దొరకడంతో చెలరేగిపోయాడు. ఇంటర్నెట్ కే అతుక్కొని పోవడం.. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. 

 

జాతీయ గణాంకాల ప్రకారం ఇంటర్ నెట్ వినియోగం 12నుంచి 30శాతం పెరిగిందంటే ఎంతలా వాడారో అర్థమైపోతోంది. సినిమాలు, షికార్లతో గడిపేవారు అన్నీ యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ లకు టైమ్ కేటాయించారు. ఈ ప్రభావం ప్రజానీకంపై పడే అవకాశం లేకపోలేదు. ఇదే అలవాటుగా మారే అవకాశముంది.   

 

విద్య కావాలన్నా.. వైద్యం కావాలన్నా నెట్ పై ఆధారపడే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసులు జోరందుకున్నాయి. విద్యార్థులు కూడా ఇలాంటి పరిణామాలకు అలవాటుపడిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో మెళకువలు నేర్చుకోవడంలో ఆరితేరారు. పలు విద్యాసంస్థలు ఇందుకు దోహదపడ్డాయి. సాధారణంగా ప్రత్యక్షంగా విద్యార్థులకు క్లాసులు చెప్పడం కంటే.. ఈ విధానం పలువురు ఉపాధ్యాయులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎక్కువ మందికి పాఠాలు చెప్పేందుకు వీలు ఏర్పడింది.  


మొన్నటి వరకు చాలా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు ఆగిపోవడంతో టెలీ మెడిసిన్ వైపే ప్రజలు మొగ్గుచూపగలిగారు. అంతగా ఎమర్జెన్సీ కాని కేసులను వీడియో కన్సల్టేషన్ ద్వారా పరిష్కరించగలిగారు. ఈ విధానంతో ఇటు పేషెంట్ వర్గానికి..అటు వైద్యులకు సమయం కలిసొచ్చే వీలుంది. ముందు ముందు కూడా టెక్నాలజీని సరైన మార్గంలో వినియోగించుకునే వీలు లేకపోలేదు. డాక్టర్లు ఎంత దూరంలో ఉన్నా తగిన వైద్య సలహాలు తీసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. లాక్‌డౌన్‌ తర్వాత టెక్నాలజీ రంగాన్ని ప్రజలు విరివిగా ఉపయోగించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: