ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనే రాజధాని అమరావతిని ప్రకటించక మునుపే టీడీపీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది. తాజాగా టీడీపీ హయాంలో సాఫ్ట్ వేర్ కంపెనీల పేరుతో జరిగిన దందా బయటకు వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీల పేరుతో వందలాది ఎకరాల భూములు, ఉద్యోగాల పేరుతో ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
సాఫ్ట్ వేర్ కంపెనీల ద్వారా లోకేష్ కు భారీగా ప్రయోజనం చేకూరినట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ చేయిస్తోంది. అధికారులు చేసిన విచారణలో ప్రభుత్వ ప్రోత్సాహకాల పేరుతో విడుదల చేసిన జీవోల ద్వారా కుంభకోణాలకు బీజాలు పడ్డాయని... టీడీపీలోని గల్లీ నాయకుల నుంచి ప్రధాన నాయకుల వరకు ఇందులో పాత్ర ఉందని అధికారుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. 
 
టీడీపీ హయాంలో ఏర్పడిన కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలలో ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి 1,75,000 రూపాయల చొప్పున ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే అంతమందికి కంపెనీకి నగదు చెల్లించింది. 100 మందికి ఉద్యోగం కల్పించే కంపెనీలకు ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించేలా జీవో జారీ చేసింది. ఆ స్థలంలో మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుని కంపెనీ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. 
 
ఈ మూడు సంవత్సరాలు కంపెనీకి ప్రభుత్వం అద్దె తాలూకు ప్రోత్సాహకం కింద పది లక్షలు ప్రోత్సాహక రూపంలో ఇస్తుంది. కంపెనీకి ఇంటర్నెట్ కోసం 15 లక్షలు, విద్యుత్ చార్జీలు యూనిట్ ఒక రూపాయిగా, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక్కో ఉద్యోగికి పది వేలు ఇస్తుంది. దీంతో పాటు ఆ కంపెనీలకు పలు ఆఫర్లు ఇచ్చింది. ఇన్నోవా సొల్యూషన్, టెంపుల్ టన్ అనే కంపెనీల కోసం ఈ జీవోలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఒక కంపెనీకి 700 కోట్లు, మరో కంపెనీకి 1100 కోట్లు ప్రయోజనం చేకూర్చేలా టీడీపీ వ్యవహరించింది. ఈ కంపెనీల ద్వారా లోకేష్ కు భారీగా ప్రయోజనం చేకూరిందనే ఆరోపణలతో ప్రభుత్వం లోకేష్ ను టార్గెట్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: