జమ్మూ కశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ హతమయ్యాడు. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలు అతణ్ని మట్టుబెట్టాయి. 8 ఏళ్లుగా భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తిరుగుతున్నాడు రియాజ్. ఈ ఎన్కౌంటర్‌తో హంద్వారా ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.
భారత భద్రతా దళాలకు భారీ విజయం దక్కింది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్ రియాజ్ నైకూ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. రియాజ్ నైకూ బియిఘ్బొరా గ్రామంలో ఉన్నాడని తెలియగానే.. కశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు.
మంగళవారం రాత్రి రియాజ్ ఉన్న ప్రాంతాన్ని దిగ్బంధించిన భద్రతా దళాలు.. టెర్రరిస్టులు ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి. రియాజ్ ను హతమార్చడం.. భారత సైన్యానికి పెద్ద విజయమనే చెప్పాలి. అతని మరణంతో స్థానికంగా ఉగ్రకార్యకలాపాలను బలహీనపర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రియాజ్ నైకూ 8 ఏళ్లుగా భద్రతా దళల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. హిజ్బుల్ చీఫ్ సయ్యిద్ సలాహుద్దీన్ కు రియాజ్ సన్నిహితుడని చెబుతారు. 2017లో అతడిని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. 2016 జులైలో బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత నయికూ హిజ్బుల్ కశ్మీర్ కమాండర్ అయ్యాడు.
తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేసిన రియాజ్ 33 ఏళ్ల వయసులో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. కశ్మీర్ వ్యాలీలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్థానిక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ను బెదిరించి రాజీనామా చేయించడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి.
కశ్మీర్ లో ఉగ్రవాదులు దీర్ఘకాలం పనిచేయటం చాలా కష్టమైన విషయం. కానీ రియాజ్ నయికూ 8 ఏళ్లకుపైగా కశ్మీర్లో ఉగ్రవాదిగా పని చేశాడు. గతంలోనూ భద్రతా సిబ్బంది చాలాసార్లు అతణ్ణి కార్నర్ చేశాయి. కానీ తప్పించుకున్నాడు. కరోనా వైరస్ పై భారత్ పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్ ఉగ్రవాదులను కశ్మీర్ లోకి ఎగదోస్తోందని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. దీంతో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో నెలరోజుల్లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ కల్నల్, మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. సోమవారం ఇదే ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు.
ఈ ఎన్ కౌంటర్ తో హంద్వారా ఘటనలో జరిగిన ప్రాణనష్టానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. అలాగే, భారత్ లో జరిపే ఉగ్రదాడులకు ప్రతీకారం తప్పదని.. ముష్కరులను ఏరిపారేసే వరకు విశ్రమించేది లేదని పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుంది.