ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మద్యపాన నిషేధం చర్యల్లో భాగంగా ప్రభుత్వం 4380 లిక్కర్ షాపులను గతేడాది 3500కు తగ్గించింది. తాజాగా ప్రభుత్వం మరోసారి మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 3500 షాపులను 2934కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మందుబాబులకు షాక్ అనే చెప్పాలి. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో లిక్కర్ ధరలను 75 శాతం పెంచింది. రాష్ట్రంలో రేట్లు పెరిగినా మద్యం కొనుగోలు చేసి వారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కీలక ప్రకటన విడుదల చేసింది.
ఏ జిల్లాలో ఎన్ని దుకాణాలను తగ్గించారనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు మద్యం దుకాణాల దగ్గర లాక్ డౌన్ నిబంధనలు పాటించటం లేదని, మందుబాబులు మాస్కులు ధరించడం లేదని వార్తలు వస్తూ ఉండటంతో అధికారులు కొత్త నిబంధనలను తెరపైకి తెస్తున్నారు. పలు ప్రాంతాల్లో మద్యం కావాలంటే మాస్క్ తో పాటు గొడుగు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మరికొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే మద్యం విక్రయిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని మద్యం షాపుల దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్నారని వార్తలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. మద్యం రేట్ల పెంపుపై కూడా టీడీపీ విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం.