విశాఖలో గ్యాస్ ఘోరం కలకలం రేపింది. అర్థరాత్రి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ కావడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. జనం ఊపిరి తీసుకోలేకపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. రోడ్లపైకి వచ్చిన జనం నురగలు కక్కుకుంటూ రోడ్లపై పడిపోయారు. కొందరు రక్తం కక్కుకున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ముగ్గురు చనిపోయారు. వందల మంది అనారోగ్యం పాలయ్యారు.
ఈ ఘటన చూస్తే 1980ల్లో జరిగిన బోఫాల్ విషయవాయువు ఘటనను గుర్తుకు తెచ్చింది. భోపాల్ వాయువు విషాదం భారతదేశంలోనే అత్యంత విషాదమైన గ్యాస్ లీక్ సంఘటన. అంతే కాదు.. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తుగా చెప్పుకుంటారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన పురుగుమందుల ప్లాంట్లో 1984 డిసెంబరు 2 అర్థరాత్రి మిథైల్ ఐసోసనియేట్ లీకైంది.
దాదాపు 5 లక్షల మంది ఈ వాయువు బారిన పడ్డారు. భోపాల్ నగరంలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విష వాయువు తన ప్రభావం చూపింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 4 వేల మంది వరకూ చనిపోయారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం 8,000 మంది మరణించారని ఓ అంచనా.
అయితే ఈ భోపాల్ విషవాయువు ఘటన ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. ఆ విష వాయువు ప్రభావం.. కొందరిలో తరతరాలుగా వేధిస్తోంది. మూడో తరంలోనూ కొందరిలో అంగ వైకల్యానికి కారణమవుతోందన్న నివేదికలూ ఉన్నాయి. ఇప్పుడు విశాఖలోని ఎల్జీ గ్యాస్ ఘటన మరోసారి భోపాల్ విషవాయు ఘటనను గుర్తు చేసింది. జనం గుండెలపై కుంపట్లుగా మారిన ఇలాంటి పరిశ్రమలను తక్షణం నగరం బయటకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.