ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో కృషి చేస్తున్నా ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు అందడం లేదు. వివిధ సమస్యలతో బాధ పడుతున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. రెడ్ క్రాస్ కమిటీ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెనీ డునాంట్ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీని స్థాపించారు. యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే రెడ్‌క్రాస్ సొసైటీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవాసంస్థలన్నింటిలో రెడ్ క్రాస్ సొసైటీ అతి పెద్దది. 1895లో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు చనిపోయారు.
ఆ సమయంలో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. హెన్రీ డునాంట్ ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 14 వ అంతర్జాతీయ సదస్సులో అంతర్జాతీయ కమిషన్ శాంతికి ప్రధాన సహకారిగా రెడ్‌క్రాస్‌ను ప్రవేశ పెట్టింది. టోక్యోలో 1934లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రూస్ సూత్రాలను ఆమోదించారు. అనంతరం రెడ్ క్రాస్ ను వివిధ ప్రాంతాలలో కూడా వర్తింపజేశారు.
రెడ్‌క్రాస్‌కి సంబంధించిన అన్ని సంస్థలు ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాయి. ప్రకృతి వైపరిత్యాలు, వరదలు, భూకంపాలు సంభవించిన సమయంలో వారిని ఆదుకునేందుకు రెడ్‌క్రాస్ సంస్థలు నిరతరం కృషి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలకు గౌరవార్థంగా ఈరోజును జరుపుకుంటారు. అత్యవసర పరిస్థితుల నుండి వారి ప్రాణాలను రక్షించడానికి రెడ్ క్రాస్ సంస్థలు ఎంతో కృషి చేస్తాయి.