దేశంలో కరోనా మహమ్మారి విజృంభించటంతో రెండు నెలల క్రితం చికెన్ కొనే వాళ్లు కరువయ్యారు. చికెన్ తింటే కరోనా సోకుతుందని సోషల్ మీడియాలో వదంతులు వైరల్ కావడంతో చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే చికెన్ తింటే కరోనా సోకదని ప్రముఖ రాజకీయ నాయకులు చెప్పటంతో చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
రోజురోజుకు చికెన్ కొనే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో మాంసం దుకాణాదారులు చికెన్ రేట్లను భారీగా పెంచేశారు. మొన్నటివరకు కిలో చికెన్ 50 నుంచి 60 రూపాయలు పలకగా ప్రస్తుతం కిలో 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి దుకాణాదారులు కిలో చికెన్ పై 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెంచినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ధర 200 దాటిందని సమాచారం.
చికెన్ ధరలు భారీగా పెరగడంతో కిలో చికెన్ కొనే వినియోగదారులు అరకిలో చికెన్ తో సరిపెట్టుకుంటున్నారు. వ్యాపారులు కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చికెన్, మటన్ రేట్లను పెంచుతున్నారని వినియోగదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కిలో మటన్ 700 రూపాయల కంటే ఎక్కువ ధరకు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది.
చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో చికెన్ పై ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా మరలా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న 33 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1196కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.