భారతదేశంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వల్ల కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా స్తంభించింది. బస్సులు, రైళ్లు, విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అయితే మే 17వ తేదీతో మూడవ విడత లాక్ డౌన్ ముగియనుండగా కేంద్రం ప్రజా రవాణాకు పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. 
 
ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం మే ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తివేయనుందని... త్వరలోనే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. మరోవైపు లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన ప్రజా రవాణాను పునరుద్ధరించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపనున్నాయని సమాచారం. 
 
భౌతిక దూరం పాటించడం కోసం ఇద్దరు కూర్చునే సీట్లో ఒకరు చొప్పున ప్రయాణికులను కూర్చోనిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తాత్కాలికంగా కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని... నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల్లో 30 నుంచి 50 శాతం టికెట్ రేట్లను పెంచనున్నాయని తెలుస్తోంది.         
 
బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులకు శానిటైజర్లను అందజేస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల గత 50 రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడవనుండటంతో టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. ప్రయాణికులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని రకాల సర్వీసులకు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: