ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య తగ్గిందనుకునే లోపు ఏదో ఒక రూపంలో వైరస్ విజృంభిస్తోంది. నిజానికి ఏపీలో మొదట్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. రాష్ట్రం నుంచి మర్కజ్ కు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి.
మర్కజ్ కేసులు నమోదైన వెంటనే ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసి మర్కజ్ కు హాజరైన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. అనంతరం పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడింది. అయితే మూడు రోజుల క్రితం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
కానీ గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కోయంబేడు, అజ్మీర్ నుంచి రాష్టానికి వస్తున్న వలస కూలీలే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కోయంబేడుతో పాటు అజ్మీర్ లింకులు బయట పడుతున్నాయని తెలుస్తోంది. కేంద్రం వలస కార్మికులకు అనుమతులు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
వలస కార్మికుల వల్లే రాష్ట్రంలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు 48 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2205కు చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 49కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 1353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.