కరోనా దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ఆ వైరస్ పేరు వింటనే ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్నాయి. గత మూడు నెలలుగా ఎక్కడచూసినా కరోనా కేసులు, మరణాలు గురించిన లెక్కలే. రోజురోజుకి వైరస్ తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. సూపర్ పవర్‌గా చెప్పుకుంటున్న అమెరికా, రష్యాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కట్డడికి ఎన్ని చర్యలు చేపట్టినా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 48లక్షలకు చేరువైంది. 3 లక్షలకు పైగా కరోనా వైరస్‌కు ప్రాణాలు కోల్పోయారు. 18 లక్షల 44 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంకా చాలా దేశాలు వైరస్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్నాయి.
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు కరోనా కేసుల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. వైరస్ కు ప్రభావితమైన మొదటి రెండు స్థానాల్లో ఈ రెండు దేశాలే నిలిచాయి. అమెరికాలో కేసుల సంఖ్య 15 లక్షల 16 వేలకు చేరింది. 90 వేల 346 మంది కరోనాకు బలయ్యారు. సడలింపుల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ రోజుకు పదివేలకు పైగా కేసులు రికార్డవుతున్నాయి. స్పెయిన్, యూకే, బ్రెజిల్‌ను కిందకు నెట్టేసి... రెండో స్థానంలోకి చేరుకుంది రష్యా...రాజధాని మాస్కో మొత్తం కరోనా వ్యాపించింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనే ఉన్నాయి. మొత్తం 2 లక్షల 81 వేల మంది బాధితులున్నారు. 9 వేల 700 మంది మృతి చెందారు.
ఇక మెక్సికోలో 2 లక్షల 77 వేలకు పైగా కేసులు నమోదు కాగా.., 27 వేల 650 మంది మరణించారు. బ్రెజిల్‌లో కరోనా సూపర్‌సానిక్ వేగంతో వ్యాపిస్తోంది. చూస్తుండగానే అక్కడి కేసుల సంఖ్య 2 లక్షల 33 వేలు దాటింది. మరణాల సంఖ్య 15 వేల 668కి చేరింది. బ్రెజిల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే వైరస్ విజృంభించడానికి కారణాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయ్. మెక్సికోలో మరణాల సంఖ్య ఆరు వేలకు చేరువగా ఉంది.
అరబ్ దేశాల్లో కూడా కరోనా తన ప్రభావం చూపిస్తోంది. సౌదీ అరేబియా, ఖతార్‌ల్లో దాదాపు లక్ష మంది బాధితులు ఉన్నారు. దాయాది పాక్‌లో కూడా కరోనా వేగం పెంచింది. పాకిస్తాన్‌లో కేసుల సంఖ్య 40 వేలు దాటింది. దాదాపు 9 వందల మంది కరోనాకు బలయ్యారు. చైనాలో కూడా మళ్లీ కేసులు మొదల్వడంతో అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. డ్రాగన్ కంట్రీలో మరోసారి కరోనా విజృంభించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.