ప్రతి పేదవాడికి సొంత స్థలం ఇచ్చి, దానిలో ఇల్లు కట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తూ, ఆ మేరకు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదట ఇళ్ల స్థలాలు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 8న ఆ పేదలకు భూ పంపిణీ చేయనుంది. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో భూములు సేకరించి, స్థలాలు చేసే కార్యక్రమం కూడా చేస్తోంది.

 

అయితే ఈ భూములు సేకరించే విషయంలో వైసీపీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పేదలకు ఇచ్చే స్థలాల్లో వాటాలు కొట్టేస్తున్నారని మాట్లాడుతున్నారు. అలాగే ఇటీవల కాకినాడలో ఉన్న మడ అడవులని నరికి ఇళ్ల స్థలాలు కింద ఇవ్వాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది. అలా చేయడం వల్ల లబ్దిదారులకు ముంపు ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

 

ఇదే సమయంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో కూడా మడ అడవులు నరికి ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారని చెప్పి, ఓ ఇద్దరు మత్స్యకారులు హైకోర్టు మెట్లు ఎక్కారు. మడ అడవిని కొట్టివేయడం చట్ట విరుద్ధమని వారి తరుపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఇక వాదనలు విన్న ధర్మాసనం.. మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో విధించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

 

అయితే ఈ మడ అడవులు నరికివేత కార్యక్రమం మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో జరుగుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని మంత్రికి షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఓ ఇద్దరు మత్స్యకారులు హైకోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు కూడా మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో విధించింది. మరి దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ దాఖలు అవుతుందో చూడాలి. ప్రభుత్వం కౌంటర్ పట్ల హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేయకపోతే మంత్రికి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: