ఆంధ్రప్రదేశ్‌...తెలంగాణ మధ్య జ‌ల వివాదం ముదురుతోంది. పోతిరెడ్డిపాడు విస్తరణపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే ... తెలంగాణ ప్రాజెక్టులను తప్పుబట్టింది ఏపీ ప్రభుత్వం. 

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించటంలేదు. కృష్ణా...గోదావరి జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కృష్ణా... గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డులకు ఏపీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇంచార్జి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అనుమతి లేకుండా కడుతున్న ప్రాజెక్టులపై పూర్తి వివరాలు అందించారు. 

 

తెలంగాణ ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ, సీడబ్ల్యూసీ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. మిగులు జలాలు ఉన్నాయని తెలంగాణ ఐదు కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని ఏపీ ఫిర్యాదులో తెలిపింది. తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను బోర్డుకు ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుపై డీపీఆర్ ఇవ్వాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం కోరినా ఇప్పటివరకూ ఇవ్వలేదని పేర్కొంది. ఇక దీనిపై కేంద్రానికి, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరుతున్నామని ఏపీ అధికారులు తెలిపారు.

 

కృష్ణా బేసిన్‌లో నీటి వాటాలు, వినియోగంపై రెండు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. నూతన ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంపై కోర్టులను ఆశ్రయించగా వాటిపై వాదనలు కొనసాగుతున్నాయి. ఐతే గతేడాది నుంచి రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోగా... నీటి సమస్యలపై ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు ఆత్మగౌరవ విషయంగా భావిస్తున్నారు. ఫలితంగా సమస్య జఠిలం అవుతుందని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: