ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు పూర్తి జీతాలను చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టిన జగన్ సర్కార్ ఈ నెల నుంచి పూర్తి జీతాలను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ, ట్రెజరీకు ఈ మేరకు ఆదేశాలు అందాయి.
ట్రెజరీ సాఫ్ట్ వేర్ లో ఈ మేరకు మార్పులు చేశారు. అయితే కోత విధించిన జీతాలను ఏపీ ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రభావం తెలంగాణపై పడింది. తెలంగాణలో గత రెండు నెలల నుంచి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నారు. జగన్ పూర్తి జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఉద్యోగులు పూర్తి జీతాలను చెల్లించాలని కోరుతున్నారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ కు మే నెలకు పూర్తి జీతాలు చెల్లించాలని లేఖ రాసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తున్నారని అందువల్ల ఈ నెలకు పూర్తి జీతాలు చెల్లించాలని జేఏసీ కోరింది. పూర్తి జీతాల చెల్లింపు విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈరోజు లేదా రేపు వేతనాలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఏపీలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2514కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు తెలంగాణలో కూడా నిన్న 62 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1761కు చేరింది. రాష్ట్రంలో నిన్న ముగ్గురు మృతి చెందగా మృతుల సంఖ్య 48కు చేరింది.