ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణతో దేశంలో, ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. అయితే కరోనా కష్ట కాలంలో కూడా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్రంలో 9,700 డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ జరగనుందని తెలిపారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణికులు వస్తూ ఉండటంతో వారి కోసం అదనపు బెడ్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా వైద్య పరీక్షల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.
ఈరోజు జరిపే పరీక్షలతో రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 3,00,000 దాటుతుందని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతులు, నిరుద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఆగష్టు నెలలో రాష్ట్రంలో 2,70,000 గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించుకున్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరేలా చేశారు.
1,26,728 గ్రామ,వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నారు. తాజాగా మరోసారి 16,000 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. తాజాగా ప్రభుత్వం మరోసారి ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.