క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్. ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ నెలంతా కఠిన ఉపవాస దీక్షలు చేశారు. అయితే కరోనా లాక్‌డౌన్ వల్ల రంజాన్ మాసంలో ముస్లింలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రంజాన్ ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసం. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ కేలండర్‌లో వచ్చే తొమ్మిదవ నెలే రంజాన్. ఈ నెలలోనే దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించింది. ముస్లింల జీవన విధానం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అల్లాకు ప్రార్ధనలు ఎలా చేయాలి వంటి విషయాలను ఈ గ్రంథం వివరిస్తుంది. జీవిత నావకు చుక్కాని లాంటి ఈ గ్రంధాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉపవాస దీక్షలు అర్పిస్తారు భక్తులు. నెల రోజుల పాటు ఖురాన్ చూపించే మార్గంలో భక్తిశ్రద్ధలతో జీవితాన్ని గడపుతారు. రోజా ఉండటం ఎంత ముఖ్యమో... ఈ నెలలో ఖురాన్ చదవటమూ అంతే కీలకం. ఖురాన్‌లో ఉండే 30 అధ్యాయాలను రోజుకొకటి చొప్పున తరావీ అనే ప్రత్యేక నమాజులో చదవడం రివాజు.
రంజాన్ మాసం ఎంతో ఉన్నతమైన లక్ష్యాలతో కూడుకున్నది. అల్లాపట్ల దైవభక్తిని పెంచడమే కాదు... మనుషుల్లో ప్రేమాభిమానాలు, దానగుణాన్ని పెంపొందించడమూ ఈ పండుగలో కనిపిస్తుంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడం ఇది ఇచ్చే ఒక సందేశం. ధనికులైన ముస్లింలు ఈ నెలతో జకాత్ ఆచరించాలని ఖురాన్ బోధిస్తుంది. ఆస్థిలో నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయటాన్ని జకాత్ అంటారు. దీని ప్రకారం ప్రతి వ్యక్తి సంవత్సరాంతంలో మిగిలిన తన ఆదాయం నుంచి రెండున్నర శాతం చొప్పున డబ్బును లెక్కించి... నిరుపేదలకు దానం చేస్తారు. ఇది కాకుండా ఫితరా పేరుతో మరి కొంత మొత్తాన్ని విధిగా పేదలకు ఇస్తారు. ఈ విధానం వల్ల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వాళ్లకు కొంత ఊరట లభిస్తుంది.
కరోనా లాక్‌డౌన్ వల్ల బంధుమిత్రులతో ఇఫ్తార్ విందులు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు లేవు. అయితే ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో అల్లాకు మరింత భక్తి ప్రవత్తులతో ప్రార్ధనలు చేస్తోంది ముస్లిం సమాజం.