జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు హైకోర్టుని నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పలు విషయాల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి తీర్పులు వచ్చాయి. తాజాగా కూడా ఇంగ్లీష్ మీడియం, డాక్టర్ సుధాకర్, సచివాలయాలకు రంగులు, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. దీంతో ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లతో పాటు కొందరు వైసీపీ అనుకూలంగా ఉండేవారు హైకోర్టు తీర్పుని తప్పుబట్టారు.
ఈ క్రమంలోనే కోర్టు తీర్పులు, జడ్జిలను కించపరుస్తూ మీడియాలో మాట్లాడటంతో పాటు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టడంపై ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించి కోర్టు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
ఇలా వైసీపీ నేతలకు నోటీసులు రావడంతో టీడీపీ నేతలు నానా హంగామా చేస్తున్నారు. న్యాయవ్యవస్థ పటిష్టంగా లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్‌లేకుండా పోయేదని, వైసీపీ నేతలు పదవులు చూసుకుని మాట్లాడుతున్నారు.. పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టదని వర్ల రామయ్య లాంటి వారు మాట్లాడుతున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు.
అయితే హైకోర్టు తీర్పు రాకమునుపే టీడీపీ నేతలకు తీర్పు ఇలా వస్తుందనే అనుమానంతోనే పలువురు వైసీపీ నేతలు ఆ విధంగా కామెంట్ చేశారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటున్నారు. పైగా ఓ హైకోర్టు సీనియర్ న్యాయవాది డైరక్ట్‌గా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఇక అలా విమర్శలు చేస్తే ప్రజలు ఏమని అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పైగా కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకోకముందే వర్ల లాంటి వారు, పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టదని ఎలా మాట్లాడుగలుగుతున్నారని అడుగుతున్నారు.