యువతులకు సమాజంలో రక్షణ లేకుండా పోయింది. ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి లాగుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఏపీలోని అనంతపురం చెందిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువుల దగ్గర పెరిగిన యువతి పెళ్లి చేయడం కోసం బంధువులు పడుతున్న కష్టాలను చూసి ఉద్యోగం చేసి వారికి అండగా నిలబడాలని ఆశించింది. 
 
తనకు తెలిసిన ఒక పరిచయస్తురాలిని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కోరగా ఆమె అందుకు అంగీకరించి ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి నమ్మించింది. ఆ తరువాత యువతిని వ్యభిచార రొంపిలోకి లాగడానికి ప్రయత్నించగా యువతి చాకచక్యంగా తప్పించుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే అనంతపురంకు చెందిన యువతి పద్మావతి అనే మరో మహిళను ఉద్యోగం ఇప్పించాలని కోరింది. 
 
తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని... ఎలాగైనా ఉద్యోగం ఇప్పించి సహాయం చేయాలని యువతి పద్మావతిని కోరింది. పద్మావతి యువతికి ప్రొద్దుటూరులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అక్కడ ఒక మహిళ ఇంట్లో ఉంచింది. అక్కడకు వెళ్లిన తరవాత ఎన్ని రోజులైనా ఉద్యోగం గురించి చెప్పకపోవడంతో యువతి మహిళను ఉద్యోగం గురించి నిలదీసింది. ఆమె ఇక్కడ ఉద్యోగాలు లేవని వ్యభిచారం చేయాలని యువతికి చెప్పడంతో షాక్ అవ్వడం యువతి వంతైంది. 
 
అక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించిన యువతి అక్కడినుంచి తప్పించుకుని తనకు తెలిసిన మరో మహిళ దగ్గర ఆశ్రయం పొందింది. యువతి బంధువులు యువతికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా యువతి ప్రొద్దుటూరులో ఉన్నట్టు తెలిసింది. యువతి తనకు జరిగిన అనుభవాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: