దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తుండటంతో కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాలు మూతబడ్డాయి. ఈ నెల 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనుండటంతో కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాష్ట్రంలో ఆలయాలను తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలో ఆలయాలను తెరుస్తామని ప్రకటించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
త్వరలోనే ఆలయాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్సవాలు, జాతరలకు మాత్రం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వం రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి పాఠశాలలను కూడా తెరవాలని భావిస్తోంది. అయితే రాష్ట్రంలో ఆలయాలు తెరిచినా మసీదులు, చర్చీలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. నిన్నటివరకు కర్ణాటక రాష్ట్రంలో 2283 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రెండో దశ లాక్ డౌన్ నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు అమలవుతున్నాయి. అయితే ఆలయాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మతానికి అనుమతులు ఇచ్చి మిగతా మతాలకు చెందిన ఆలయాలపై ఆంక్షలు విధించడం మూర్ఖత్వమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోంది. మరోవైపు లాక్ డౌన్ సడలింపులు విధిస్తూ ఉండటంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
మార్చి 25 నుంచి మూతబడిన ఆలయాలు ప్రస్తుతం తెరుచుకుంటూ ఉండటం గమనార్హం. గుడిలో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామని.... 52 ఆలయాలకు మాత్రం ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుని వెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది. అనారోగ్యంతో బాధ పడే వారిని మాత్రం అనుమతించబోమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు కూడా ఆలయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.