ఎంతో హడావుడిగా, ఎంతో వేగంగా హైదరాబాద్ నుంచి కరకట్టకు వచ్చాడో ... ఇప్పుడు అంతే వేగంగా హైదరాబాద్ లోని తన సొంత నివాసానికి వెళ్ళిపోయాడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు. అసలు చంద్రబాబు ఆఘమేఘాల మీద ఏపీకి వచ్చిన ఉద్దేశం విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడమే కాదు, బాధిత గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చి రాజకీయ మైలేజ్ పొందాలన్నదే అసలు ఉద్దేశం. అసలు ఏపీకి వచ్చేందుకు ముందుగా కేంద్రం అనుమతి కోరడం వారు నిరాకరించడం, ఆ తరువాత ఏపీ డిజిపి కి లెటర్ రాయడం, వారు అనుమతి ఇవ్వడం జరిగాయి. కానీ బాబు మాత్రం విశాఖలో విమాన సర్వీసులు నడవడం లేదన్న కారణంగా అమరావతికి కారులో చేరుకున్నారు.
కరకట్ట నివాసం నుంచి జూమ్ యాప్ లో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అది పూర్తి కాగానే తన కుమారుడు నారా లోకేష్ తో సహా కలిసి హైదరాబాద్ లోని తన నివాసానికి రోడ్డు మార్గం బయలుదేరి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 02:42 లకు ఉండవల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. అసలు చంద్రబాబు ఇంత అకస్మాత్తుగా ఏపీకి రావడానికి కారణమైన విషయాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోవడంతో అందరిలోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఆయన హైదరాబాదులో ఉండి ఉంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ జయంతికి నివాళులర్పించే అవకాశం ఉండేదని, హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ ద్వారా మహానాడు లో పాల్గొనే ఉండేవాడిని, ఇప్పుడు విశాఖ వెళ్లకుండానే హైదరాబాద్ కు వెళ్లి పోవడం పై అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ ఏపీలో ఎక్కువగా ఉండడం తనను కలిసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు వస్తుండడం, మొహమాటం కొద్దీ వారికి దగ్గరగా ఉండి మాట్లాడ్డం వంటివి చేస్తున్నారు. కానీ వయసు రీత్యా ఇది అంత శ్రేయస్కరం కాకపోవడంతో, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో లోకేష్ తో సహా చంద్రబాబు హైదరాబాద్ కి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మళ్లీ కరోనా ప్రభావం ముగిసేవరకు హైదరాబాద్ లోనే యధావిధిగా జూమ్ యాప్ ద్వారా పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.