ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సంక్షేమమే తన ప్రాధాన్యంగా ఆయన పాలన సాగింది. ఏడాదిలోనే దాదాపు 90 శాతం మేనిఫెస్టోను అమలు చేశానని ఆయన సగర్వంగా చెప్పుకుంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఇలా ఏడాది, రెండో ఏడాది, మూడో ఏడాది.. ఇలాంటి సందర్భాల్లో పత్రికలకు ప్రకటనలు ఇస్తూనే ఉంటారు. జగన్ సర్కారు సాధారణంగా ఇలాంటి ప్రకటనలకు పెద్దగా ఇంట్రస్టు చూపించదు.

 

 

గతంలో అనేక పథకాల సమయంలో జగన్ పెద్దగా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. కానీ.. మొదటి ఏడాది కాబట్టి ఈసారి బాగానే ప్రకటనలు ఇచ్చినట్టున్నారు. ప్రధానంగా సొంత పత్రిక సాక్షి అయితే ఏకంగా పండుగే చేసుకుంది. తమ అధినాయకుడు సీఎంగా ఏడాది పూర్తి చేసుకోవడం ఓ పండుగైతే.. ఆ సందర్భంగా కుప్పులు తెప్పలుగా ప్రకటనలు రావడం పత్రిక పరంగా మరో పండుగ అనే చెప్పాలి.

 

 

తొలి ఏడాది సందర్భంగా సాక్షి పత్రిక ప్రకటనలతో నిండిపోయింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చినవే కాకుండా.. వివిధ సంస్థలు శుభాకాంక్షలు చెబుతూ ఇచ్చినవీ భారీగానే ఉన్నాయి.

పత్రికలో తొలి 6,7 ఫుల్ పేజీలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. మరో మూడు పేజీలు వివిధ సంస్థలు శుభాకాంక్షల ప్రకటనలు వచ్చాయి. మొత్తం 23 పేజీల ఎడిషన్లో పది- పన్నెండు పేజీలు ప్రకటనలకే సరిపోయాయి. ఇక మిగిలిన పేజీల్లోనూ జగన్ సంక్షేమ పథకాల వివరణలతో సాక్షి ఫుల్లుగా పండుగ చేసుకుంది.

 

 

విచిత్రం ఏంటంటే.. జగన్ రోజూ తాను పసుపు మీడియాతో పోరాడుతున్నానని చెబుతుంటారు. అయినా సరే ఈనాడు పత్రికకు కూడా మొదటి పేజీ ఫుల్ యాడ్ ఇచ్చేశారు. కానీ పాపం.. ఆంధ్రజ్యోతికి మాత్రం అలాంటి అదృష్టం దక్కలేదు. అందుకే కాబోలు.. జగన్ పాలన ఫెయిల్ అని చెప్పకుండానే చెబుతూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో గ్రాఫిక్ ప్రజంటేషన్ స్టోరీ ఇచ్చింది. ఈ పత్రికలో కనీసం పావు పేజీ కూడా ప్రకటనలు ఇవ్వలేదు. కనీసం వివిధ సంస్థలు, నాయకులు కూడా ఇవ్వలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: