స్టైరీన్ గ్యాస్ లీకేజ్ పాపం ఎవరిది...? 13మందిని బలితీసుకున్న విషవాయువులు ఎలా బయటకు వచ్చాయి..? ఇది ప్రమాదమా... మానవతప్పిదమా...? ఈ ప్రశ్నలకు ఎన్జీటీ తన నివేదికలో షాకింగ్ నిజాలు బయటపెట్టింది. జనం ప్రాణాలు అన్నా...భద్రతా ప్రమాణాలు అన్నా...ఎల్జీ కంపెనీకి ఏమాత్రం లెక్కలేదని తేలిపోయింది. 

 

13మంది ప్రాణాలను బలితీసుకుని...వందల మంది భవిష్యత్తును భయపెడుతున్న విశాఖలోని ఎల్జీ పాలిమర్ కంపెనీలో లొసుగులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యయన కమిటీ బయటపెట్టింది. మే-7న సంభవించిన స్టైరీన్ గ్యాస్ ప్రమాదంపై జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలోని ఎన్జీటీ బృందం విచారణ నిర్వహించింది. ఇందు కోసం ప్రమాద స్ధలం, ప్రభావిత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. ఈ నెల 12న స్టేక్ హోల్డర్స్, కంపెనీ ప్రతిని ధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించింది. తన విచారణలో తేలిన అంశాలతో రూపొందించిన కన్సోలిడేటెడ్ నివేదికను ఎన్జీటీకీ సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరగడానికి మానవతప్పిదం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలుగా నిర్ధారించింది. ఈ నివేదికను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్ సైట్ లో పొందుపరిచింది.కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జూన్ మొదటివారంలో విచారణ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఎల్జీ పాలిమర్ కంపెనీలోని స్టైరీన్ ట్యాంక్ ల దగ్గర ప్రమాదాన్ని కంపెనీ సిబ్బంది నిముషాల వ్యవధి లోనే గుర్తించినప్పటికీ...వాటిని నియంత్రించడంలో మాత్రం విఫలమయ్యారని ఎన్జీటీ కమిటీ నివేదిక తేల్చింది.  ఉత్పత్తి,సేఫ్టీ విభాగంలో జవాబుదారీతనం లోపించినట్టు నిర్ధారణకు వచ్చిన బృందం ...తీవ్రమైన మానవతప్పిదాలు, బాధ్యులైన అధికారులు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది. స్టైరీన్ లీక్ అయ్యే సమయంలో 8మం ది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించి ఉన్నత అధికారులను అప్రమత్తం చేశారు. కానీ, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అలారమ్ మాత్రం మోగించలేదు. దీనికి కారణం....అప్పటికే స్టైరీన్ ఆవిర్లు అలారమ్ వున్న ప్రాంతానికి వ్యాపించడమే.

 

స్టైరీన్ నిల్వ చేసేందుకు ఎల్జీ కంపెనీ రెండు ట్యాంకులను వినయోగిస్తోంది. వీటిలో ఒకటి పరిశ్రమ ప్రారంభించే సమయంలో ఏర్పాటు చేసింది. అంటే 1978 కాలం నాటిది. దీని కెపాసిటీ సుమారు 2500టన్నులు. మే-7న ప్రమాదం సంభవించింది ఈ ట్యాంక్ దగ్గరే. సాధారణంగా 80-90శాతం స్టైరీన్ నిల్వలను ఈ ట్యాంక్ లో వుంచుతారు. ఈ లెక్కన ట్యాంక్ లో వున్న రసాయనం నిల్వ సుమారు 1900టన్నులు. ప్రమాదం జరిగిన తర్వాత మిగిలింది1000నుంచి1100టన్నులు. అంటే గాల్లో కలిసిన స్టైరీన్ విషవాయువులు సుమా రు 800టన్నులు. ఈ ట్యాంక్ దగ్గర ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణాలను విశ్లేషించింది. ఒకటి ట్యాంక్ పాతది కావడంతో హీట్ ఇండికేటర్లు సరిగా పనిచేయకపోవడం.... రెండు పగటి ఉష్ణోగ్రతలను సిబ్బంది అంచనా వేయకపోవడం. కొత్త ట్యాంక్ లో 3300టన్నుల స్టైరీన్ నిల్వలు వున్నట్టు ఎన్జీటీ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: