హైదరాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పదిహేను రోజుల క్రితం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్లో రోడ్డుపై కనిపించిన చిరుత... అటవీ అధికారుల ట్రాప్ నుంచి తప్పించుకుంది. అప్పటి నుంచి... చిరుత ఏవైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి చిరుత సంచారం కెమెరాలకు చిక్కడంతో... హడలిపోతున్నారు.
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్, బుద్వేల్, అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది చిరుతపులి. 15 రోజుల కిందట నడిరోడ్డుపై కనిపించి... ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసి... అందర్నీ బెంబేలెత్తించిన చిరుత... అధికారులు అప్రమత్తమై పట్టుకునేలోపే పారిపోయింది. అడవిలోకి వెళ్లిపోయిందిలే అని అనుకుంటే... మళ్లీ తన ఉనికి చాటుతూ కలవరపెడుతోంది.
బుద్వేల్ సమీపంలో ఫాంహౌస్ నుంచి తప్పించుకున్న చిరుత.. పదమూడు రోజుల తర్వాత సీసీ కెమేరాలకు చిక్కింది. అగ్రికల్చరల్ యూనివర్సిటీ సమీపంలోని సీసీ కెమెరాల్లో చిరుత సంచారం కనిపించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత జాడ కనిపెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. గగన్ పహాడ్ చెరువు సమీపంలోనే చిరుత ఉన్నట్లు నిర్ధారించుకున్నారు.
రెండేళ్ళ క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవి యాచారం, మాడ్గుల్, కందుకూర్ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులు, మేకలు, గొర్రెలపై చిరుతలు దాడులు చేస్తూ వచ్చాయి. ఏడాది తర్వాత వీటి సంతతి పెరిగి, నాలుగు చిరుతలు ఉన్నట్లు పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం మర్రిగూడ మండలం అజిలాపూర్, రాజీపేట తండా, అలాగే షాద్‌నగర్‌లో పట్టుబడిన చిరుతలతో పాటు, రాజేంద్రనగర్‌లో సంచరిస్తున్న చిరుత కూడా ఇక్కడి నుంచే వెళ్లి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నాలుగు చిరుతల్లో ఒకటి చనిపోగా రెండు చిరుతలను అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు నాలుగో చిరుతను పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు... అటవీ అధికారులు.