ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రఎన్నికల కమిషనర్ వ్యవహారం కొత్త చర్చలకు దారి తీస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ జగన్ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవి చేపడతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అసలు నిమ్మగడ్డ నియామకమే చెల్లదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నట్టు తెలిపింది.
అయితే ఇంతలోనే కొన్ని అత్యుత్సాహపు మీడియా సంస్థలు.. జగన్ కోర్టు తీర్పులు అమలు చేయకపోతే ఏం జరుగుతుంది అన్న అంశంపై కథనాలు వండివారుస్తున్నాయి. డిబేట్లు నిర్వహిస్తున్నాయి. జగన్ సర్కారు హైకోర్టు తీర్పులను కూడా గౌరవించడం లేదంటూ ఇప్పటికే టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు.
అయితే మరి నిజంగానే జగన్ కోర్టు తీర్పులను అమలు చేయకపోతే ఏమవుతుందన్న అంశంపై ప్రోఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. జగన్ సర్కారు ఇలాంటి పని చేస్తుందని తాను భావించడం లేదన్న నాగేశ్వర్.. ఒక వేళ అలా జరిగితే ఏం జరుగుతుందో వివరించారు. జగన్ సర్కారు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయకపోతే.. రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుందన్నారు.
అలాంటి సమయాల్లో రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపుతారని.. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు రాజ్యాంగంలో అవకాశం కల్పించారని వివరించారు. అయితే అది అడ్డగోలుగా చేయకూడదని ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని నాగేశ్వర్ గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ ప్రతిష్టంభనకు కారణమైనట్టు రుజువులు ఉండాలని సూచించారు. అయితే జగన్ సర్కారు అలా చేస్తుందని తాను భావించడం లేదని.. కానీ కొన్ని మీడియా సంస్థలు మరింత ముందడగు వేసి ఏదో జరిగిపోతున్నట్టు చర్చలు నిర్వహించడం సరికాదని నాగేశ్వర్ హితవు పలికారు.