అమెరికా సహా ఎనిమిది దేశాలు ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో ప్రమాదం పొంచి ఉందని భావించి అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఒకవైపు చైనా భారత్ వివాదం నెలకొన్న తరుణంలో మరోవైపు చైనాకు వ్యతిరేకంగా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడటం గమనార్హం. 19 మంది పార్లమెంట్ సభ్యులతో ఏర్పడిన ఈ కూటమి చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
అమెరికా, జర్మనీ, నార్వే, స్వీడన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ సహా యూరోపియన్ పార్లమెంట్ సభ్యులతో కలిసి కూటమి ఏర్పడింది. చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమిపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జెంగ్ షువాంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ నిబంధనలను, సంబంధాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని.... స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన తెలిపారు. 
 
మరోవైపు చైనా భారత్ వివాదం పరిష్కారం కోసం నిన్న ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగానే ఉన్నాయని... చర్చల గురించి ఊహాగానాలు వద్దని అధికార వర్గాలు చెబుతున్నాయి. చర్చల ప్రక్రియ ఇంకా మిగిలే ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సరిహద్దు వివాదానికి ప్రారంభమైన లఢఖ్ సెక్టార్ లో నిన్న ఉదయం చర్చలు ప్రారంభమయ్యాయి. 
 
చర్చల్లో ప్రధానంగా భారత్ ఉద్రిక్తతలకు కారణమైన పరిస్థితులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు వివరించినట్లు తెలుస్తుంది. చైనా తరపున చర్చల్లో పాల్గొన్న హరీందర్ సింగ్ తామేమీ వివాదాల లోతుల్లోకి వెళ్లబోవట్లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ కు ముందునాటి పరిస్థితులు నెలకొనడానికి సహకరించాలని కోరారు. ఘర్షణ వాతావరణం పునరావృతం కాకూడదని తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా చైనా వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: