దేశంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు సంఖ్య పెరుగుతూనే పోతోంది. 24గంటల్లో అత్యధికంగా 9వేల 971 కేసులు రికార్డయ్యాయి. కరోనా ప్రారంభమైన తర్వాత ఇంత పెద్దస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు ప్రపంచ కరోనా కేసుల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి చేరింది. కేసులు తీవ్రత చూస్తుంటే ఒకటి రెండు రోజుల్లో.. టాప్‌ ఫైవ్‌ క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

దేశంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 9, 971 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 46వేల 628కి చేరింది. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా 287 మంది మరణించారు. ఇప్పటి వరకు లక్షా 19వేల 293 మంది కోలుకున్నారు. ప్రస్తుతం లక్షా 20వేల 406 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6వేల 929మంది చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు 46లక్షల 66వేల 386 మందికి టెస్టులు చేశారు.

 

దేశంలో ఎక్కువగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ మొత్తం 79వేలకు పైగా కేసులు ఉండగా... ఇప్పటి వరకు 37 వేల మందికి పైగా కోలుకొని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 42వేలకు పైగా యాక్టీవ్ కేసులున్నాయి. ఆ తర్వాత తమిళనాడులో 30లకు చేరువలో కేసులున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఉత్తర్ ప్రదేశ్‌లో  ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 

 

కరోనా కేసుల్లో క్రమంగా టాప్ ‌లో ఉన్న దేశాలను చేరుకుంటుంది భారత్‌. తాజా లెక్కల ప్రకారం అత్యదికంగా కరోనా కేసులు నమోదవతున్న దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా మెదటి స్థానంలో ఉండగా... రెండవస్థానంలో బ్రెజిల్, తర్వాత రష్యా, స్పెయిన్, యూకే తర్వాత భారత్ ఉంది. ఇప్పటికే ఇటలీని దాటింది భారత్. రోజుకు పదివేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన... ఒకట్రెండు రోజుల్లో స్పెయిన్‌ను దాటేసే అకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: