రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం నుంచే హోటళ్లు, రెస్టారెంట్లు తెరచుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 80 రోజులుగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే రోడ్లపై జనాల రద్దీ పెరగగా నిబంధనలు సడలించటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లను ఎలాంటి నిబంధనలతో అనుమతించాలి...? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇంట్లో ఉండాలని ... హోటల్ మేనేజ్‌మెంట్ దానికి అనుగుణంగా సలహా ఇవ్వాలని కేంద్రం సూచించింది. కరోనా ప్రమాదాన్ని తగ్గించటానికి అవసరమైన చర్యలను హోటల్ సిబ్బంది మరియు అతిధులు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని ఆదేశించింది. 
 
వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని... బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ కవర్లు, మాస్కులు ధరించాలని ఆదేశించింది. ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని... హోటళ్ళలో ఎటువంటి లక్షణాలు లేని అతిధులను మాత్రమే అనుమతించాలని... కస్టమర్లు సామాజిక దూరం పాటించేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించింది. 
 
సిబ్బంది గ్లౌజులు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.... పార్కింగ్ స్థలాలలో సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చూడాలని.... సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి తగిన దూరంతో నిర్దిష్ట గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించింది. కస్టమర్ మారిన ప్రతిసారి టేబుళ్లను శుభ్రపరచాలని... వంటగదిలో సిబ్బంది సామాజిక దూర నిబంధనలను పాటించాలని... ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: