తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా మూడు నెలల తర్వాత కరెంట్ బిల్లులు తీయడంతో.. వినియోగదారులకు షాక్ కొడుతోంది. పలుచోట్ల ఎక్కువ బిల్లులు వచ్చాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఎవరికీ ఎక్కువ బిల్లులు వేయలేదని వివరణ ఇచ్చింది. అందరూ ఇళ్లలో ఉండటం వల్లే విద్యుత్ వినియోగం పెరిగిందని, మూడు నెలల బిల్లు ఒకేసారి రావడంతో.. ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తోందని చెప్పింది. 

 

విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చాయన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వేసవిలో సాధారణంగా విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ సారి కొవిడ్‌-19 కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో విద్యుత్‌ వాడకం పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో 35 నుంచి 40 శాతం వినియోగం పెరుగుతుంది. ఈ సారి అంతకంటే 15 నుంచి 20 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో 70 శాతం మంది మాత్రమే విద్యుత్‌ బిల్లులు చెల్లించారని సర్కారు తెలిపింది.

 

రీడింగ్‌ తీయకముందే రెండు నెలలైనా, మూడు నెలలైనా సరాసరి తీసుకుంటామని ఇది వరకే చెప్పిన సంగతి ప్రభుత్వం గుర్తుచేసింది.  ఒకవేళ ఎక్కువ చెల్లించి ఉంటే సర్దుబాటు చేస్తామని చెప్పామని, బిల్లులు అలాగే పంపామని తెలిపింది. ఏ నెలకు ఆ నెల బిల్లు కాగితంలో వేర్వేరుగా చూపించనప్పటికీ సరాసరి లెక్కనే బిల్లులు ఇచ్చామంటోంది ప్రభుత్వం. కొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు కూడా అధికంగా బిల్లులు వచ్చాయన్నారని, వారి బిల్లులు తెప్పించి మరీ వివరణ ఇచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

 

వినియోగదారులు వాడిన దానికంటే ఎక్కడా ఒక్క పైసా కూడా బిల్లు అధికంగా ఇవ్వలేదన్న తెలంగాణ సర్కారు.. మూడు నెలలకు కలిపి బిల్లు ఇవ్వడంతోనే ఎక్కువగా వచ్చినట్లు వినియోగదారులకు అనిపిస్తోందని చెప్పింది. అయితే వినియోగదారులు మాత్రం తమకు సాధారణంగా వచ్చే బిల్లుల కంటే అధికంగానే బిల్లులు వచ్చాయని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: