గత కొన్ని రోజులుగా భారత్ చైనా వివాదం గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉత్కంఠ కొంతమేర తగ్గినట్టు తెలుస్తోంది. గాల్వన్ ప్రాంతంతో పాటు మరో మూడు చోట్ల చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లింది. భారత సైన్యం కూడా కొంతమేర వెనక్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య తూర్పు లఢఖ్ లో చర్చలు జరిగాయి. 6వ తేదీన జరిగిన చర్చలు సఫలం కావడం వల్లే చైనా సైనికులు వెనక్కు వెళుతున్నట్టు తెలుస్తోంది. 

 
వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు సమస్యల విషయంలో భేదాల్ని వివాదాలుగా మారకుండా చూడాలన్న ఏకాభిప్రాయానికి ఇరు దేశాలు వచ్చాయి. త్వరలో ఇరు దేశాల బెటాలియన్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. చైనా ఎట్టకేలకు తోక ముడవటంతో భారత్ తన సైన్యాన్ని వెనక్కు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర వర్గాలు ఖండించాయి. ఆక్రమణపై వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమేనని తేల్చి చెప్పాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశ సారభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత అంశాల్లో వెనుకడుగు వేయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. చైనా బలగాలు వెనక్కు వెళ్లటంతో నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
తాత్కాలిక నిర్మాణాల నుంచి భారీ సంఖ్యలో సైనికులు తిరోగమించారని.... సైనికులు ఎంతమంది అనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలు తగ్గి పూర్వ స్థితి నెలకొంటుందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యకం చేస్తున్నారు. ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ పాంకాంగ్ సరస్సు వద్ద కూడా నిష్క్రమణ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. అతి త్వరలో భారత్ చైనా వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: