దేశంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా గురించి ప్రతిరోజూ కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాధి లక్షణాల గురించి, వైరస్ వ్యాప్తి గురించి, వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. 
 
వాస్తవానికి ఇప్పటివరకు కరోనాకు వ్యాక్సిన్ కానీ మందు కానీ అందుబాటులోకి రాలేదు. అమెరికా, చైనా, బాబా రాందేవ్ త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటనలు చేస్తున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. భౌతిక దూరం గురించి కొందరు నాలుగు అడుగులు అని, కొందరు ఆరు అడుగులు అని, మరికొందరు పద్నాలుగు అడుగులు అని చెబుతున్నారు. 
 
తాజాగా కరోనాకు సంబంధించిన కొత్త థియరీ వెలుగులోకి వచ్చింది. కరోనా యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని..... చాలామందికి పరీక్షలు నిర్వహిస్తేనే వైరస్ సోకిందో లేదో నిర్ధారణ అవుతోందని.... సోకిన వారికి ఏడు రోజుల్లో నయమవుతోందని..... లక్షణాలు లేని వారి నుంచి రోగ నిర్ధారణ అయిన వారికి సంక్రమణ అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఈ థియరీ చెబుతోంది. 
 
మరోవైపు కరోనా లక్షణాలు కనిపించని వారి నుంచే వైరస్ సోకుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. వైరస్ గురించి వినిపిస్తున్న వార్తలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ప్రజలు మాస్క్ ధరించాలని... ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని.... కరోనా లక్షణాలు కనిపించని వారి నుంచి సోకే అవకాశాలు తక్కువని.... అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ భారీన పడకుండా తమను తాము రక్షించుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: