యెడుగూరి సంధింటి రాజశేఖర రెడ్డి.... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల పరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల అమలు ద్వారా చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు. 1949 సంవత్సరం జులై 8వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. ఆయన తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టరుగా పనిచేసేవారు. 
 
బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన వైయస్సార్ అనంతరం విజయవాడలోని లయోలా కాలేజీలో చేరారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్న వైయస్సార్ వైద్యవృత్తిని అభ్యసిస్తున్న సమయంలోనే విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు.... కడప శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. 
 
1980 - 1983 మధ్య కాలంలో మంత్రి పదవిని నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగా, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. 1989 - 94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి ప్రసిద్ధుడిగా రాజశేఖర్ రెడ్డికి పేరుంది. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 
 
రాజశేఖర్ రెడ్డి 2003లో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు రాష్ట్రమంతటా పర్యటించారు. రాజశేఖర రెడ్డి కృషి వల్ల 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడం లాంటి కార్యక్రమాలతో రైతులకు ప్రయోజనం చేకూరేలా చేశారు. ఐదేళ్ల పాలనలో రాజశేఖర రెడ్డి స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చారని ప్రజలు నేటికీ చెబుతూ ఉంటారు. 2009 లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: