దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. అన్ లాక్ 1.0 లో సడలింపులు ఇచ్చినప్పటి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రతిరోజూ 12,000కు పైగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం కరోనాతో వణికిపోతున్న సమయంలో కొన్ని రోజుల క్రితం ఐ.సీ.ఎం.ఆర్ దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి ఎంత మాత్రం లేదని ప్రకటన చేసింది. 
 
ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ ఈ మేరకు స్పష్టం చేశారు. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి జరగలేదని కీలక ప్రకటన చేశారు. మరణాల రేటు కూడా స్వల్పంగానే ఉందని, ఆస్పత్రుల్లో పడకల కొరత ఏమాత్రం లేదని వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ కారణంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని.... ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయని వ్యాఖ్యలు చేశారు. 
 
దేశంలో మరణాల రేటు కేవలం 2.8 శాతమే ఉందని ఆయన చెప్పారు. అయితే దేశంలో సామూహిక వ్యాప్తి లేదని ఐ.సీ.ఎం.ఆర్ చేస్తున్న వ్యాఖ్యలను వైద్య, ఆరోగ్య నిపుణులు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. అన్ లాక్ 1.0 సడలింపుల తర్వాత దేశంలో వైరస్ వ్యాప్తి పెరిగిందని.... సామూహిక వ్యాప్తి వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. 
 
దేశంలో నిత్యం వెలుగు చూస్తున్న కేసులే సామాజిక వ్యాప్తికి నిదర్శనమని వారు చెబుతున్నారు. దేశంలో నిన్నటివరకు 3,32,424 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో 1,69,798 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 9,520 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: