సీఎం జగన్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నుండి ఏదైనా హామీ ఇస్తే మాట తప్పను మడమ తిప్పను అని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. నవరత్నాలను అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ పథకాలను బాగానే అమలు చేస్తున్నారని ప్రజల నుండి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పథకాల అమలులో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని సక్రమంగానే అమలు చేస్తున్నారు. 
 
అయితే కొన్ని హామీల విషయంలో మాత్రం జగన్ స్పష్టత ఇవ్వడం లేదని ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు జగన్ సర్కార్ నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సేవలందిస్తున్నామని వారు చెబుతున్నారు. జగన్ అవ్వాతాతలు ఇద్దరికీ పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో డ్వాక్రా యానిమేటర్ల గురించి చర్చ జరుగుతోంది. జగన్ పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే వారికి 10,000 రూపాయల జీతం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని ఆచరణలో పెట్టమని వారు అడుగుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం వారికి 3000 రూపాయలు చెల్లిస్తోంది. కొన్ని నెలల క్రితం పది వేలలో 8,000 ప్రభుత్వం ఇస్తుందని మిగిలిన 2,000 గ్రామ సచివాలయాల ద్వారా ఇస్తామని పేర్కొన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగానే ఏపీలో కూడా పెళ్లికానుకను అమలు చేస్తామని చెప్పారని ఆ హామీని కూడా అమలు చేయాల్సి ఉందని వారు చెబుతున్నారు. యానిమేటర్లు, విద్యుత్ ఉద్యోగులు, అవ్వాతాతల పెన్షన్లు వెంటనే హామీలను అమలు చేయకపోయినా ఎప్పటినుంచి అమలు చేస్తారో డేట్లను ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ సర్కార్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నల పట్ల ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: