
వాట్సాప్ లో ఒక న్యూస్ గ్రూప్ ను క్రియేట్ చేసి చుట్టుపక్కల సమస్యలపై అందరికి గ్రూప్ లలో పంపించేవాడు. స్థానికంగా ఉన్న అనేక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేవాడు. తనకు తాను జర్నలిస్ట్ గా చెప్పుకుని అనేక సమస్యల మీద వాట్సాప్ లో పోస్ట్ లు పెడుతుండే. ఏమైందో ఏమో తెలియదు ఒక రోజు శవమై తేలాడు. స్థానికంగా కల కలం రేపిన ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ (27) కొంతకాలంగా క్రైమ్ ఇండియా రిపోర్టింగ్ పేరిట వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తూ నందిగామ ప్రాంతంలోని అనేక వివాదాస్పద అంశాలు, అక్రమాలపై పోస్టింగ్‌లు పెడుతుండేవాడు. 14వ తేదీ నుంచి నవీన్ కనిపించకపోవడంతో అతడి తల్లి అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... ఈనెల 14వ తేదీ రాత్రి కనిపించకుండా పోయిన నవీన్ శనివారం సాయంత్రం నందిగామలోని కాకతీయ పాఠశాల రోడ్డు చివరిలో ఉన్న ఖాళీ స్థలంలో విగతజీవిగా కనిపించాడన్నారు. నవీన్ దీంతో అనేక మంది ఫిర్యాదులు చేయడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ తెరిచారని వెల్లడించారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ కనకారావు విచారించారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ, తహసీల్దారు చంద్రశేఖర్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. నందిగామకు చెందిన గోనెల సాయితో నవీన్‌కు వ్యక్తిగత కక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
14వ తేదీ రాత్రి నవీన్ సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా పట్టణ శివారు అనాసాగరం వద్ద సాయి, కె.రమణ అడ్డగించి సెల్ఫోన్లో ఫొటోలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. కోపంతో వారిద్దరు నవీన్ తలపై బండరాయితో మోది చంపేశారని పోలీసులు వెల్లడించారు. నవీన్ ను చంపి 18వ తేదీ తెల్లవారుజామున వెలికితీసి సాయి ఇంటి వెనుక భాగంలోని ఖాళీస్థలంలో పూడ్చిపెట్టారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానికంగా జరిగే అనేక అక్రమాలను వెలుగులోకి తెస్తున్నాడన్న కక్షతోనే నవీన్‌ను చంపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.