అనంతపురం జిల్లా...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ అధికారంలోకి రావడానికి అనంత జిల్లా మద్ధతు చాలా ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి అనంతలో ఆ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయి. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే 12 సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.

 

ఎప్పుడు లేని విధంగా టీడీపీ కేవలం 2 సీట్లు గెలుచుకుంటే, వైసీపీ 12 సీట్లు దక్కించుకుంది. హిందూపురంలో బాలయ్య, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌లు మాత్రమే గెలిచారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ తరుపున 12 మంది గెలిస్తే అందులో 8 మంది రెడ్డి సామాజికవర్గ నేతలే. రాయదుర్గం-కాపు రామచంద్రారెడ్డి, కదిరి-పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి, ధర్మవరం-కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తి-దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అనంతపురం టౌన్-అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి-కేతిరెడ్డి పెద్దారెడ్డి, గుంతకల్-వెంకట రామిరెడ్డి, రాప్తాడు-తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు గెలిచారు.

 

అయితే ఇలా ఒకే జిల్లాలో 8 మంది ఒకే సామాజికవర్గం నేతలు గెలవడం ఓ రికార్డు అనే చెప్పొచ్చు. ఇక ఈ రెడ్డి ఎమ్మెల్యేల్లో సిద్ధారెడ్డి, పెద్దరెడ్డిలు మంచి పనితీరు కనబర్చడం లేదని తెలుస్తోంది. కానీ మిగిలిన వారు మాత్రం టీడీపీని ఎదగనివ్వకుండా దూసుకెళుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకు తోపుదుర్తి చెక్ పెట్టేసినట్లే కనిపిస్తోంది.

 

ఎన్నికలై ఏడాది దాటిన పరిటాల ఫ్యామిలీ పుంజుకోలేదు. అటు అనంతపురంలో సీనియర్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారు. ఇక రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి...టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులకు పెద్ద స్కోప్ ఇవ్వడం లేదు. అటు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, గుంతకల్‌లో వెంకట రామిరెడ్డిలు ప్రత్యర్ధులకు పుంజుకునే అవకాశం ఇవ్వడం లేదు. అయితే ఈ విధంగా రెడ్డి ఎమ్మెల్యేలు దూసుకెళుతూ కంచుకోట లాంటి అనంతలో టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: