ఏ వ్యవహారం అయినా, తెగే వరకు లాగా కూడదు అనేది పెద్దల మాట. అలా లాగితే తెగతెంపులు తప్పదు. ఇప్పుడు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో అదే జరగబోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి పార్టీపైన, పార్టీ అధిష్టానంపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేవలం ఏదో ఒక అంశంపై కాకుండా, చాలా అంశాలను వివరిస్తూ ప్రభుత్వ తీరును మీడియా ద్వారా విమర్శించడం వైసీపీ లో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా, అదేపనిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో ఆయన వ్యవహారం పై సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ కోరింది. నోటీసు అందిన రెండోరోజు ఈ వ్యవహారంపై రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు.
వైసీపీపై అనేక ప్రశ్నలు సంధించారు. అసలు వైఎస్ఆర్ సిపీ ఉనికిని ప్రశ్నిస్తూ ప్రశ్నలు వేయడం సంచలనం రేపింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారు ? రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు వంటి ప్రశ్నలు వేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు వ్యవహారం ముదిరింది, ఆయనకు పార్టీలో ఉండే ఆలోచన లేదని, ఆయనకు వేరే ఉద్దేశాలు ఉన్నాయనే అభిప్రాయానికి వైసిపి అధిష్టానం వచ్చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా ? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా ? క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ ఎవరు ? సభ్యులు ఎవరు ? క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు పంపించాలంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశమైంది.
వైసీపీపై ఇంత ఘాటుగా ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకుంటే లాభం లేదని, పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ఇక వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కూడా రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన బిజెపిలో చేరేందు కే ఇంత ఘాటుగా విమర్శలు చేస్తున్నారని వైసిపి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.