2019 ఎన్నికల్లో అనేక సంచలనాలు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ చరిత్రలో లేని విధంగా వైసీపీ 151 సీట్లు గెలుచుకుంటే, ఊహించని విధంగా టీడీపీ 23 సీట్లు తెచ్చుకుని ఘోర పరాజయం పాలైంది. ఇక సినిమాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్ పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలవ్వడం పెద్ద సంచలనమే అయింది. పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
అయితే రెండు చోట్ల కాపు ఓటర్లు ఎక్కువ ఉండటంతో పవన్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కనీసం గాజువాకలో ఓడిపోయిన, భీమవరంలో గెలిచేస్తారులే అని పవన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఊహించని విధంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు. ముఖ్యంగా భీమవరంలో పవన్‌పై వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ 8 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక పవన్ మీద గెలవడం వల్ల భీమవరం ప్రజలు గ్రంథి మీద అంచనాలు ఎక్కువగానే పెట్టుకున్నారు.
వారి అంచలనాలకు తగ్గట్టుగానే గ్రంథి పనిచేసుకుని వెళుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భీమవరం రూరల్ ప్రాంతాల్లో గ్రంథికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఎన్నికల సమయంలో భీమవరం టౌన్‌లో ఓట్లు ఎక్కువగా పవన్‌కు పడ్డాయి. కానీ పవన్ ఇప్పుడు భీమవరం గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియకపోవడం వల్ల, టౌన్ ప్రజలు కూడా గ్రంథికి మద్ధతుగా నిలుస్తున్నారు.
ఇదే సమయంలో ఇక్కడ టీడీపీకి కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయం సాధించిన పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)...మొన్న ఎన్నికల్లో 54 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. ఒకవేళ ఇక్కడ పవన్-టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే గ్రంథి విజయం సాధ్యమయ్యేది కాదు. అయితే ఎన్నికలైపోయాక పవన్, అంజిబాబులు భీమవరం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓడిపోయిన దగ్గర నుంచి అంజిబాబు పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఒకానొక సమయంలో ఆయన పార్టీ మారిపోతారని వార్తలు కూడా వచ్చాయి. కానీ చంద్రబాబు బుజ్జగించడంతో ఆగినట్లు తెలుస్తోంది.
అంజిబాబు ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నారుగానీ, ప్రజల్లో మాత్రం ఉండటం లేదు. ఇటు అంజిబాబు, అటు పవన్‌లు భీమవరం ప్రజలకు దూరంగా ఉండటం గ్రంథికి బాగా కలిసొచ్చింది. ప్రతిపక్షాలకు పుంజుకునే స్కోప్ లేకపోవడం గ్రంథికి ప్లస్ అవుతుంది. ఎన్నికల సమాయనికంటే గ్రంథి ఇప్పుడు ఇంకా లీడింగ్ పెంచుకున్నట్లే కనిపిస్తోంది.