ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఫుజిరహా సివిల్ కోర్టు భర్తను మోసం చేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న భార్యకు షాక్ ఇచ్చింది. గల్ఫ్ లోని ఫుజిరహా ప్రాంతంలో భార్యాభర్తలు కలిసి జీవించేవారు. భార్య ప్రవర్తనలో అనూహ్యమైన మార్పును గమనించిన భర్తకు ఆమెపై అనుమానం కలిగింది.
ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం బలపడటంతో భర్త భార్యకు తెలియకుండా ఫాలో చేశాడు. ఆ సమయంలో సదరు భర్తకు అనుమానం నిజమేనని తెలిసింది. పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లడమే ఆలస్యం బయటకు వెళుతున్న భార్య ఓ పరాయి వ్యక్తిని కలవడం కోసమే ఇంటి నుంచి వెళుతున్నట్టు భర్త గుర్తించాడు. భర్తకు అనుమానం రాకుండా ఆమె ప్రియుడిని వేరువేరు ప్రాంతాలలో కలుసుకునేది.
భార్య తనను మోసం చేసిందని తేలడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేర్వేరు రెస్టారెంట్లు, ప్రాంతాల్లో భార్య, ఆమె ప్రియుడిని కలిసేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు భర్త ఇచ్చిన ఆధారాల ద్వారా భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ఫుజిరహా సివిల్ కోర్టులో విచారణకు రాగా కోర్టు భర్త ఇచ్చిన ఆధారాలను పరిశీలించి న్యాయస్థానం భార్యను దోషిగా తేల్చిందని చెప్పారు.
భర్తను మోసం చేసి మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకున్నందుకు 50 వేల దిర్హామ్స్ (రూ.10.29 లక్షలు) జరిమానా విధించింది. అనంతరం భర్త అభ్యర్థన మేరకు విడాకుల కోసం కేసును ఫ్యామిలీ కోర్టుకు రెఫర్ చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భర్తను మోసం చేసిన భార్యకు 10 లక్షల రూపాయల జరిమానా విధించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.