కరోనాపై తెలంగాణ సర్కారు బ్రహ్మాండంగా పోరాడుతోందంటూ మంత్రి ఈటల రాజేందర్ చెప్పే మాటల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా ఓ కరోనా రోగి సెల్ఫీ వీడియో ఇప్పుడు తెలంగాణలలో హాట్ టాపిక్ అయ్యింది.. తాజాగా.. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో ఓ వ్యక్తికి ఆక్సిజన్ తొలగించడంతో దారుణ పరిస్థితుల్లో చనిపోయాడు. చివరిసారిగా బై డాడీ బై అంటూ.. ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో సర్కారు దవాఖానాల్లో పరిస్థితికి అద్దం పడుతోంది.
“వెంటిలేటర్ పీకేసిర్రు. ఊపిరాడుతలేదు అంటుంటే కూడా పెడ్తలేరు. చచ్చిపోతున్నా. అందరికి బాయ్ డాడీ..” అంటూ తుదిశ్వాస విడిచే ముందు బాధితుడు తీసుకున్న వీడియో చూపరుల గుండెల్లో ఆవేదనను రగిలిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రైనా , ప్రైవేటు ఆసుత్రులైన కరోనా వస్తే చికిత్స ఇంతే దారుణమా..? అన్నఆందోళన, భయం జనిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కరోనాతో హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పోరేషన్, బి.జే.ఆర్ నగర్ కి చెందిన వ్యక్తి.
ఆయన చనిపోయే ముందు తన ఫోన్ లో తీసుకున్న వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. మృతుడి మాటలు.. ఊపిరాడటం లేదని చెప్పే మాటలు వింటే.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం ఎలాఉందో చెబుతున్నాయి. పాపం అతడు చెప్పినా కూడా వినకుండా.. మీకు ఆక్సిజన్ టైమ్ అయిపోయింది.. వేరేవాళ్లకు పెట్టాలి అనుకుంటూ.. తీసుకెళ్లిపోయారని అతడి మాటలను బట్టి తెలుస్తుంది.
ఈ వీడియోను బట్టి.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా సరిపోయినన్ని లేవా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకే సిలిండర్ ను.. మార్చి మార్చి.. చాలామందికి విడతలవారీగా వాడుతున్నారని కూడా తెలుస్తోంది.. ఆక్సిజన్ సిలిండర్లు క్రిటికల్ పేషెంట్లకు కూడా సరిపోయినన్ని లేవా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వీడియోపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..!