దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రం , ఆ రాష్ట్రమని తేడా లేదు. అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. కొత్త కేసుల నమోదు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో మళ్లీ లాక్‌డౌన్‌పై దృష్టిపెట్టాయి ప్రభుత్వాలు. 

 

కరోనా కేసులను కంట్రోల్ చేయాలంటే...లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం అని భావిస్తున్నాయి రాష్ట్రాలు. లాక్‌డౌన్ ఎగ్జిట్‌ను గందరగోళంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ... మళ్లీ లాక్‌డౌన్‌ అమలుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. మణిపూర్‌, అసోంలో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఆదివారం నుంచి రెండువారాల పాటు కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ కొనసాగనుంది. నిత్యవసరాలకు ముందే కొనుగోలు చేసుకోవాలని అసోం ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం అత్యవసర సేవలు, మందుల షాపులకు మాత్రమే అనుమతించింది. 

 

ఇటు తమిళనాడులో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో గ్రేటర్‌ చెన్నై పరిధిలో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, మధురై, తేని జిల్లాలో కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని భావిస్తోన్న తమిళనాడు ప్రభుత్వం...పళనిస్వామి ఉన్నతాధికారులతో సమావేశం అవుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా లాక్‌డౌన్‌పై ఆ తర్వాత క్లారిటీ రానుంది.

 

రాజస్థాన్‌ సర్కార్ ఓవైపు లాక్‌డౌన్‌కు సిద్ధమవుతూనే... కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో భౌతికదూరం పాటిస్తూ ఆలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కొద్ది మందికి మాత్రమే వెళ్లేందుకు అనుమతిచ్చింది. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు 14 రోజుల  క్వారంటైన్‌ ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 

 

అసలే వర్షాకాలం. ఈ సీజనల్ వ్యాధులకు తోడు... కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నమ్ముతున్నాయి ప్రభుత్వాలు. అయితే కరోనా కేసులు ఎప్పుడు తగ్గుతాయన్నది ఎవరికీ క్లారిటీ లేదు. ఈ లాక్‌డౌన్ ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో కూడా ఊహించలేం. దీంతో ప్రభుత్వాలపై మండిపడుతున్నారు జనం. సరైన సమయాల్లో టెస్టులు చేయకుండా..మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ సమయంలోనైనా టెస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: